ఆలూ చిప్స్‌ రుచి తెలుసు.. చరిత్ర తెలుసా? 

ఆలూ చిప్స్‌.. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే స్నాక్స్‌. వాటిని తినడం మొదలుపెడితే అయిపోయేవరకు ఆపలేం. దుకాణాల్లో రకరకాల రుచుల్లో వివిధ బ్రాండ్లు...

Published : 29 Aug 2020 14:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆలూ చిప్స్‌.. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే స్నాక్స్‌. వాటిని తినడం మొదలుపెడితే అయిపోయేవరకు ఆపలేం. దుకాణాల్లో రకరకాల రుచుల్లో వివిధ బ్రాండ్లు తయారుచేసే ప్యాకింగ్స్‌ లభిస్తుంటాయి. వీటికి ప్రత్యేక దుకాణాలూ ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమైన ఈ ఆలూ చిప్స్‌ను అసలు ఎవరు తయారు చేశారు? ప్రపంచానికి ఎలా పరిచయమయ్యాయో తెలుసా? అది తెలుసుకోవాలంటే 19వ శతాబ్దం ప్రారంభంలోకి వెళ్లాలి.

ఆలూ చిప్స్‌ తయారు చేసే విధానాన్ని 1817లో విలియమ్‌ కిచినర్‌ అనే శాస్త్రవేత్త, పాకశాస్త్ర నిపుణుడు ‘ది కుక్స్‌ ఒరాకిల్‌’ అనే పుస్తకంలో రాశాడట. 1822, 1825లో అచ్చయిన వంటలకు సంబంధించిన పుస్తకాల్లోనూ ఈ ఆలూ చిప్స్‌ తయారీ విధానం రాశారని తెలుస్తోంది. కానీ, ప్రపంచానికి ఆలూ చిప్స్‌ రుచి చూపించింది మాత్రం న్యూయార్క్‌కు చెందిన జార్జ్‌ క్రమ్‌ అని చరిత్రకారులు చెబుతున్నారు.

బుద్ధి చెప్పాలని చిప్స్‌ తయారు చేశాడు

1853లో జార్జ్‌ క్రమ్‌ న్యూయార్క్‌లోని మూన్స్‌ లేక్‌హౌస్‌ అనే రెస్టారెంట్‌లో వంటమనిషిగా పని చేసేవాడు. ఒక రోజు ఓ కస్టమర్‌ అప్పటికే పాపులరైనా ఆలూ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను ఆర్డర్‌ చేశాడు. వాటిని తిన్న కస్టమర్‌ చప్పగా ఉన్నాయంటూ వెనక్కి పంపించాడు. అలా రెండు సార్లు ఫ్రెంచ్‌ఫ్రైస్‌ను వెనక్కి పంపడంతో జార్జ్‌ క్రమ్‌కు చిర్రెత్తుక్కొచ్చింది. అంతే బంగాళదుంపను నిలువుగా కాకుండా అడ్డంగా.. సన్నగా కట్‌ చేసి, కరకరలాడే విధంగా నూనెలో వేయించాడు. వాటిపై బాగా ఉప్పు చల్లి కస్టమర్‌కు ఇచ్చాడు. వాటిని తిన్న కస్టమర్‌ ‘వాహ్‌!.. ఎంత రుచిగా ఉన్నాయో’ అంటూ లొట్టలేసుకుంటూ తినేశాడట. దీంతో వాటి రుచి చూడాలని కస్టమర్లు రెస్టారెంట్‌ ముందు క్యూ కట్టారు. అలా క్రమ్‌ చేసిన ఆలూ చిప్స్‌ ఫేమస్‌ అయిపోయాయి. మొదట ఆలూ చిప్స్‌కు క్రమ్‌ ‘సరసొటా చిప్స్‌’ అని నామకరణం చేశాడు. ఆ తర్వాత సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించి ‘పొటాటో క్రంచెస్‌’గా మార్చాడు. 

జనాలకు చేరిందెప్పుడంటే..

అప్పట్లో చిప్స్‌ తినాలంటే కేవలం రెస్టారెంట్‌కే వెళ్లాల్సి వచ్చేది. కానీ, 1895లో ఒహియోకి చెందిన విలియమ్‌ టప్పెండన్‌ చిప్స్‌ను ఊరూరా అమ్మడం మొదలుపెట్టాడు. అయితే 1920లో హెర్మన్‌ లే అని వ్యక్తి కూడా ఆలూ చిప్స్‌ తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు. ఆయనే ‘లేస్’ చిప్స్‌ యజమాని. ఆ తర్వాత అనేక కంపెనీలు ఈ చిప్స్‌ను తయారు చేయడం మొదలు పెట్టాయి. అలా ఓ రెస్టారెంట్‌కు మాత్రమే పరిమితమైన ఈ రుచి దేశదేశాలూ దాటుకుని మన ఇంటికి చేరిందన్నమాట!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts