AP News: అమరావతి రైతులపై రెండు కేసులు.. నిబంధనలు పాటించాలన్న ప్రకాశం ఎస్పీ

అమరావతి పరిరక్షణ సమితి మహా పాదయాత్రలో రైతులు హైకోర్టు ఉత్తర్వులు, డీజీపీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌ ఒక ప్రకటనలో ..

Published : 07 Nov 2021 18:24 IST

ఒంగోలు: అమరావతి పరిరక్షణ సమితి మహా పాదయాత్రలో రైతులు హైకోర్టు ఉత్తర్వులు, డీజీపీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న ఆరోపణలను ఖండించారు. శాంతి భద్రతలను కాపాడేందుకే పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎస్పీ స్పష్టం చేశారు.

‘‘అమరావతి పరిరక్షణ సమితికి కొన్ని షరతులు విధిస్తూ మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిర్వాహకులు యాత్రలో పాల్గొనే 157 మంది సభ్యుల జాబితాతో పాటు రూట్ మ్యాప్‌, ఊరేగింపులో భాగమయ్యే వాహనాల జాబితాను హైకోర్టుకు సమర్పించాకే పాదయాత్రకు సమ్మతించింది. పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి నిర్వాహకులు షరతులు ఉల్లంఘించారు. అనుమతించిన సంఖ్య కంటే 15 రెట్లు ఎక్కువగా.. దాదాపు 2వేల మంది పాల్గొన్నారు. నాలుగు వాహనాలకు అనుమతిస్తే 500 వాహనాలు యాత్రలో పాల్గొన్నాయి. నిర్వాహకులు హైకోర్టుకు సమర్పించిన వ్యక్తుల జాబితాలో పేర్లు లేని పలువురు రాజకీయ నాయకులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిన్న, ఈరోజు భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. రెండు హ్యాండ్‌ మైక్‌లకు అనుమతిస్తే అనేక లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించారు. పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించకుండా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనాలు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఊరేగింపులో పలువురు విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడి చేసి చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు. షరతులు ఉల్లంఘన, కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి రెండు కేసులు నమోదు చేశాం. హైకోర్టు షరతులు పాటించాలని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. ప్రకాశం జిల్లా పోలీసులు పాదయాత్ర సాగుతున్న ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు భద్రత కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, చట్టబద్ధంగా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని పాదయాత్ర నిర్వాహకులకు పోలీసులు పదే పదే సూచిస్తున్నారు. యాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తున్నందున యాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా చర్యలు తీసుకోవడమే పోలీసుల లక్ష్యమని మరింత స్పష్టం చేస్తున్నాం. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం యాత్ర సవ్యంగా కొనసాగేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు’’ అని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని