Tripura: పోలీసుల నిర్బంధంలో ప్రశాంత్‌ కిశోర్‌ బృందం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐప్యాక్‌ బృందాన్ని త్రిపుర పోలీసులు సోమవారం నిర్బంధించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సహా అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఉన్న

Published : 26 Jul 2021 23:56 IST

అగర్తల: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐప్యాక్‌ బృందాన్ని త్రిపుర పోలీసులు సోమవారం నిర్బంధించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సహా అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఉన్న ఆదరణపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు 22 మందితో కూడిన బృందం అగర్తలకు వెళ్లింది. ఈ మేరకు ఆ బృందంలోని సభ్యులు వెల్లడించారు. అక్కడ తాము బస చేసిన హోటల్‌ నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకే తమను అక్కడ నిర్బంధించినట్లు పోలీసులు చెబుతున్నారని తెలిపారు. అయితే తమ వద్ద కరోనా నిబంధనలకు సంబంధించి అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు వారు తెలిపారు. ఈ అంశంపై మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ బెనర్జీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. త్రిపురలో.. భాజపా పాలనలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందంటూ అందులో ట్వీట్‌ చేశారు.

అయితే కొవిడ్‌ నేపథ్యంలో రోజువారీ తనిఖీల్లో భాగంగానే ప్రశాంత్‌ కిశోర్‌ బృందాన్ని ప్రశ్నిస్తున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి మాణిక్‌ దాస్‌ తెలిపారు. 22 మంది బయటి వ్యక్తులు నగరంలోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో.. నగరానికి వారి రాక వెనుక ఉన్న కారణాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. వారికి కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ పలువురు నేతలతో భేటీ అయ్యేందుకు ఈ సాయంత్రం దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు అమె ప్రయత్నిస్తున్నారు.  అయితే ఈ ప్రక్రియలో ప్రశాంత్ కిశోర్‌ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన బృందాన్ని నిర్బంధించడం చర్చనీయాంశమైంది. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని