Updated : 06 Feb 2022 14:59 IST

AP PRC: ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అనుకున్నంత ఇవ్వలేకపోయామన్నారు: బండి శ్రీనివాసరావు

అమరావతి: రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనుకున్నంత ఇవ్వలేకపోతున్నట్లు సీఎం జగన్‌ చెప్పారని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. స్టీరింగ్‌ కమిటీతో ప్రతినెలా భేటీ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎంతో భేటీ అనంతరం పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో మాట్లాడారు. ఫిట్‌మెంట్‌ విషయంలో అంతకంటే అవకాశం లేదని.. అందుకే ఇవ్వలేకపోయినట్లు సీఎం చెప్పారని బండి శ్రీనివాసరావు వివరించారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, అదనపు క్వాంటం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, సీపీఎస్‌ రద్దు అంశాలపై స్పష్టత ఇచ్చారని తెలిపారు. 

ఉద్యోగుల పోరాటంతోనే.. వచ్చే ఏడాది మరో వేతన సవరణ: సూర్యనారాయణ

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుందని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ చెప్పారు. ఫిట్‌మెంట్‌ ఆశించిన మేర రాలేదనే అసంతృప్తి ఉందన్నారు. గతంలో కేంద్ర విధానాల మేరకు పదేళ్లకోసారి వేతన సవరణకు వెళ్తామన్నారని.. ఉద్యోగుల నిరసనతో ప్రభుత్వం వెనక్కి తగ్గి రాష్ట్ర పీఆర్సీ అమలు చేయడం సంతోషకరమన్నారు. ఉద్యోగుల పోరాటం వల్ల వచ్చే ఏడాది మరో వేతన సవరణ సంఘం వస్తుందని తెలిపారు. ఉద్యోగుల మద్దతుతో ఉన్నంతలో మెరుగైన ఫలితాలని రాబట్టుకున్నామని సూర్యనారాయణ చెప్పారు.

మార్చిన హెచ్‌ఆర్‌ఏతో జీతం తగ్గదు: వెంకట్రామిరెడ్డి

ఫిట్‌మెంట్‌ తప్ప మిగతా అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పీఆర్సీ సాధన సమితి మరో నేత వెంకట్రామిరెడ్డి చెప్పారు. వెంటనే ఆర్థిక లబ్ధి చేకూరకపోయినా పీఆర్సీ సాధించుకున్నామన్నారు. ఒక్క శాతం తప్ప తెలంగాణతో సమానంగా హెచ్‌ఆర్‌ఏ సాధించుకున్నామని.. మార్చిన హెచ్‌ఆర్‌ఏ వల్ల కొత్త పీఆర్సీ ప్రకారం జీతం తగ్గదని ఆయన తెలిపారు. ఐఆర్‌ కంటే ఎక్కువగా పీఆర్సీ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. రివర్స్‌ పీఆర్సీకి తావులేకుండా జీతాల పెంపునకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.

భవిష్యత్‌లోనూ ఇలాగే ఐక్యంగా ఉండాలి : బొప్పరాజు వెంకటేశ్వర్లు

భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా మంత్రుల కమిటీతో చర్చించుకోవాలని సీఏం సూచించినట్లు ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరులు తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే.. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు అంతా మంచే జరుగుతుందని జగన్‌ చెప్పారన్నారు. ‘‘ మా వంతు ఎంత వరకు ప్రభుత్వం నుంచి తీసుకురావాలో అంత తీసుకువచ్చాం. నిన్న రాత్రి చర్చలు ఫలించడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.1330 కోట్లు అదనపు భారం పడుతోంది. రికవరీ లేకుండా చేయడం వల్ల మరో రూ.5400 కోట్లు  ప్రభుత్వంపై పడింది. ఉద్యోగులంతా ఐక్యతను చూపించడం ఇదే ప్రథమం. భవిష్యత్తులోనూ ఇదే విధంగా సమస్యలు పరిష్కరిస్తాం’’ అని బొప్పరాజు అన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించే సమస్యలు పరిష్కారిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై  చర్చించి పరిష్కరిస్తామని సీఎం చెప్పారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలుగా మా కర్తవ్యాలను మేము నిజాయితీగా నెరవేర్చామని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులోనూ ఉద్యోగులు కొనసాగించాలని బొప్పరాజు కోరారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని