తెలుగు భాష, సాహిత్యం.. దేశ ప్రజలందరికీ సుపరిచితం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడారు.

Updated : 04 Dec 2022 14:00 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడారు. ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. రాష్ట్రపతిని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సత్కరించారు. 

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ తిరుమల బాలాజీ పవిత్ర స్థలానికి రావడం సౌభాగ్యంగా భావిస్తున్నానని.. విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని.. భగవంతుడు తన ప్రార్థనను తప్పక నెరవేరుస్తాడన్నారు. తన ప్రసంగంలో ఏపీకి చెందిన మహనీయుల గొప్పతనాన్ని రాష్ట్రపతి కీర్తించారు. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ తదితరుల పేర్లను ఆమె ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్నారు. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలకుగా విలసిల్లుతున్నాయని కొనియాడారు. అందరి అభిమానానికి రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.

ద్రౌపదీ ముర్ము జీవితం.. ప్రతి మహిళకూ ఆదర్శం: సీఎం జగన్‌

దేశచరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రపతి పదవిలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్మును గౌరవించుకోవడం మనందరి బాధ్యతగా భావించి పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా అణగారిన వర్గాల ప్రజల కోసం ఆమె కృషి చేశారని కొనియాడారు. జీవితంలో ద్రౌపదీ ముర్ము పడిన కష్టాలు.. వాటిని చిరునవ్వుతో స్వీకరించి ముందుకు సాగిన తీరు దేశంలోని ప్రతి మహిళకూ ఆదర్శమన్నారు. నిష్కళంకమైన రాజకీయ జీవితం, ఎదిగిన తీరు మహిళలకు స్ఫూర్తిదాయకమని జగన్‌ అన్నారు.

రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు

పోరంకిలో పౌరసన్మాన కార్యక్రమం అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతిని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ అధికారిక విందు ఇచ్చారు. ఈ విందులో సీఎంతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు