Droupadi Murmu: ఏపీ పర్యటనకు రాష్ట్రపతి.. గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీ పర్యటనకు విచ్చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

Updated : 04 Dec 2022 11:42 IST

విజయవాడ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీ పర్యటనకు విచ్చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టులో  ద్రౌపదీ ముర్ము పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గన్నవరం పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోరంకిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్‌లో రాష్ట్రపతికి పౌర సన్మానం జరగనుంది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ద్రౌపదీ ముర్మును సత్కరిస్తారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ అధికారిక విందు ఇవ్వనున్నారు. 

అనంతరం 2.35గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు రాష్ట్రపతి బయల్దేరి వెళతారు. అక్కడ రక్షణశాఖ, ఉపరితల రవాణాశాఖలకు చెందిన పలు ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో ఆమె ప్రారంభిస్తారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తారు. సాయంత్రం 4.25 నుంచి 6గంటల వరకు విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న నౌకాదళ విన్యాసాలను తిలకిస్తారు. రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 8.40కి తిరుపతి చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 5.30గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉదయం 10.50 నుంచి 11.10గంటల వరకు విద్యార్థినులతో జరిగే ముఖాముఖిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని