
AndhraPradesh: ట్రెజరీ సర్వర్‌లో ఇబ్బందులు.. వారాంతంలోనూప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశం
అమరావతి : ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ, కొత్త జీతాలు చెల్లించేందుకు సర్కారు యత్నిస్తోంది. ఈ మేరకు జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. మొత్తం 4.50 లక్షల బిల్లులకుగానూ 1.10 లక్షల బిల్లులు ట్రెజరీలకు చేరాయి. ఇప్పటి వరకూ 25 శాతం మంది ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్ అయినట్లు తెలుస్తోంది. పోలీసుశాఖతోపాటు కోర్టు ఉద్యోగుల బిల్లులే ట్రెజరీకి చేరుకున్నట్లు ఆ విభాగం వెల్లడించింది.
సర్వర్ సమస్యలతో బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యమవుతోంది. దీంతో శని, ఆదివారాల్లోనూ బిల్లుల ప్రాసెస్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాత జీతం చెల్లించాలని డీడీవోలకు ఉద్యోగులు లేఖలు ఇచ్చారు. ఉద్యోగులకు చెందిన బిల్లులు ప్రాసెస్ చేయాలని డీడీవోలపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 1 నుంచి పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల ఖాతాల్లో కొత్త వేతనాలు పడతాయని ప్రభుత్వం వెల్లడించింది.