కదలకుండా కూర్చొనే ఉంటున్నారా?జాగ్రత్త!

ఆఫీసుల్లో కుర్చీ మీద కూర్చొని పనిచేయడాన్ని మనం సంతోషంగా భావిస్తాం. అయితే గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు....

Published : 19 Jul 2021 04:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆఫీసుల్లో కుర్చీ మీద కూర్చొని పనిచేయడాన్ని మనం సంతోషంగా భావిస్తాం. అయితే గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట్లు.. అదే పనిగా కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం వల్ల మన శారీరక ఆరోగ్యం హరించుకుపోతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు, బరువు పెరిగిపోవడం వంటి సమస్యల తాకిడి పెరుగుతుంది. అన్నింటికీ మించి నాడీ వ్యవస్థపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు నిపుణులు. కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కొవ్వు, బీపీ, మధుమేహం పెరిగిపోయి గుండె సంబంధిత జబ్బులు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. సరైన పద్ధతిలో కూర్చోకపోవడం వల్ల ఎముకల్లో కాల్షియం శాతం తగ్గిపోయి ఎముకలు పలుచపడిపోతాయని వివరిస్తున్నారు. పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుపుతున్నారు. పర్సులను ప్యాంటు వెనక జేబులో పెట్టుకోవడంతో.. ఒత్తిడి వల్ల కూడా నడుం నొప్పి సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.

కొన్ని సులువైన జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా వరకూ ఈ జబ్బులు దరిచేరకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కూర్చునే చోట టేబుల్‌ను బాగా పైకి కాకుండా, కిందకు కాకుండా సరైన పద్ధతిలో అమర్చుకోవాలంటున్నారు. చేతులపై ఒత్తిడి పడకుండా అవి సేదతీరేలా టేబుల్‌పై ఉంచుకునేలా టేబుల్‌ను అమర్చుకోవాలని సూచిస్తున్నారు. కుర్చీని కూడా బాగా ఎత్తులో కాకుండా, బాగా కిందకు కాకుండా కాళ్లను నేలకు ఆనించేలా మాత్రమే కుర్చీ ఉండేలా జాగ్రత్తలు వహించాలంటున్నారు. టేబుల్‌ మీద ఉండే కంప్యూటర్‌ కూడా ఎత్తులో కానీ, కిందకు కానీ ఉండకుండా చూసుకోవాలంటున్నారు. దీంతో మెడ భాగంపై ప్రభావం పడదంటున్నారు. ఎక్కువసేపు కూర్చోకుండా గంట, గంటన్నరకు ఒకసారి లేచి అటూఇటూ నడవాలని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం కింది వీడియోను చూడండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని