Kendriya Vidyalaya: 152 నూతన కేవీల ఏర్పాటుకు ప్రతిపాదనలు.. ఏపీలో ఎక్కడెక్కడంటే?

దేశంలో 152 కేంద్రీయ విద్యాలయాలు(Kendriya Vidyalaya) ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదనలు అందినట్టు కేంద్రం వెల్లడించింది.ఈ మేరకు ఆయా ప్రాంతాల వివరాలతో జాబితాను లోక్‌సభలో అందజేసింది. 

Updated : 13 Mar 2023 21:13 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కేంద్రీయ విద్యాలయాలు(Kendriya Vidyalaya) ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదనలు వస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.  గత మూడేళ్లలో కేంద్రానికి 152 KVల కోసం ప్రతిపాదనలు అందాయని వెల్లడించింది.  రాజస్థాన్‌లోని శిరోహిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందా అని భాజపా ఎంపీ దేవ్‌జీ ఎం.పటేల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి  లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కొత్త కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించాలంటూ దేశ వ్యాప్తంగా 152 ప్రతిపాదనలు అందినట్టు పేర్కొన్నారు.  రాజస్థాన్‌లో 77 KVలతో కలిపి దేశ వ్యాప్తంగా 1,249 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. కొత్త విద్యాలయాలను ప్రారంభించడం నిరంతర ప్రక్రియ అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో రక్షణ, పారామిలటరీ సిబ్బంది, కేంద్ర స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగులు బదిలీ అయినప్పుడు వారి పిల్లల విద్యావసరాలను తీర్చే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.  కేంద్రం నుంచి కేవీల కోసం అందిన ప్రతిపాదనల జాబితాలో ఏపీ నుంచి అనకాపల్లి (అనకాపల్లి జిల్లా); మాచర్ల, రొంపిచర్ల (గుంటూరు); నందిగామ(కృష్ణా) నూజివీడు (ఏలూరు), మదనపల్లె, రాయచోటి( అన్నమయ్య), మహాసముద్రం (చిత్తూరు), పాలసముద్రం (శ్రీ సత్యసాయి) ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని