Andhra news: వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగరపంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద

Published : 24 Sep 2022 19:00 IST

పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగరపంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కిలంతర గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కిలంతర గ్రామానికి చెందిన సీహెచ్‌.సూర్యనారాయణ(38) గుండెల్లో బరువుగా ఉందంటూ కుటుంబసభ్యులు పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం ఉదయం 10 గంటలకు చేర్పించారు. ఆ సమయంలో వైద్యులెవరూ లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది వైద్యులను సంప్రదించి బాధితుడికి రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. వెంటనే సూర్యనారాయణకు వాంతులై పరిస్థితి విషమించడంతో అక్కడి సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. బంధువులు హుటాహుటిన ఆటోలో సుమారు మధ్యాహ్నం 3 గంటలకు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.

ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే సూర్యనారాయణ మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ప్రైవేటు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో సీఐ చంద్రశేఖర్‌, ఎస్సై శివప్రసాద్‌ ఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్థులకు సర్దిచెప్పారు. ఈలోగా డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై వివరణ ఇచ్చారు. ఇంజక్షన్ల వల్లే సూర్యనారాయణ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. డీఎస్పీ ఎమ్‌.శ్రావణి ఘటనా స్థలానికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని