AP New Districts: ‘రాయచోటి వద్దు.. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి’

మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మదనపల్లె జిల్లా సాధన సమితి నేతలు శుక్రవారం ఆందోళన చేపట్టారు.

Updated : 28 Jan 2022 13:21 IST

మదనపల్లె రూరల్‌: మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మదనపల్లె జిల్లా సాధన సమితి నేతలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు నేతలు షాజాన్‌ బాష, గౌతమ్‌, రమేశ్‌ ఆధ్వర్యంలో వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఎంపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని.. అన్ని అర్హతలు ఉన్న ఈ ప్రాంతాన్ని కాకుండా రాయచోటిని జిల్లాగా ప్రకటించడం శోచనీయమన్నారు. అన్నివిధాలుగా అభివృద్ధి చెంది అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మదనపల్లెను కాకుండా వేరే ప్రాంతంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దీనిపై ఎంపీ మిథున్‌ రెడ్డితోపాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి మదనపల్లె జిల్లా కేంద్రం అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

‘మదనపల్లె జిల్లా’ సాధన కోసం అర్ధనగ్న ప్రదర్శన

మరోవైపు మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలంటూ నీరుగట్టువారిపల్లి టమాటా మార్కెట్‌ ఎదుట రైతులు, హమాలీలతో కలిసి మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కార్యక్రమంలో భారత అంబేడ్కర్‌ యువసేన (బాస్‌) వ్యవస్థాపకులు శివప్రసాద్‌, చందు, దివాకర్‌, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని