భారత్‌ విజయాలు ప్రపంచానికి చాటాలి: మోదీ 

దేశ స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తి, ఇప్పటిదాకా సాధించిన విజయాలను ప్రతిబింబించేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ............

Updated : 08 Mar 2021 18:31 IST

దిల్లీ: దేశ స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తి, ఇప్పటిదాకా సాధించిన విజయాలను ప్రతిబింబించేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నిర్వహణపై ఏర్పాటైన జాతీయ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమావేశమయ్యారు. ఈ వేడుకల్లో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమన్నారు. యావత్‌ ప్రపంచానికి మనం సాధించిన విజయాలను ప్రదర్శించే అవకాశం లభించిందన్న ఆయన.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ సాధించిన విజయాలు ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇదో గొప్ప అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, 28 రాష్ట్రాల సీఎంలు, నోబెల్‌ విజేత అమర్త్యసేన్‌, భాజపా సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, విపక్ష నేతలు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, తెలుగు  రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధానిలు, పార్టీ అధినేతలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పలువురు మాజీ సీఎంలు సభ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఫార్మా దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, దర్శకుడు రాజమౌళి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు ఈ కమిటీలో చోటు దక్కిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని