Rath Yatra: అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు

ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి.

Updated : 01 Jul 2022 14:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుకలను భక్తులు తిలకించలేకపోయారు. ఈసారి అనుమతించడంతో పూరీ నగరానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జగన్నాథ నామస్మరణతో పూరీ వీధులు మార్మోగుతున్నాయి.

ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో బయల్దేరారు. అవి బయల్దేరడానికి ముందు సంప్రదాయం ప్రకారం పూరీ మహారాజు దివ్యసింగ్‌ దేవ్‌ ఆ మూడు రథాల ముందు భాగంలో బంగారు చీపురుతో ఊడ్చారు. అనంతరం రథాలు నందిఘోష్‌ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్‌ (సుభద్ర) గుండిచా మందిరం వైపు కదిలాయి. ఈ రథయాత్రలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, గవర్నర్‌ గణేశీలాల్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

అసలేంటీ గుండిచా మందిరం?

ఇది ముగ్గురు మూర్తుల జన్మక్షేత్రం. పెంచిన తల్లి (గుండిచా మహారాణి) కోరిక మేరకు జగన్నాథుడు సోదరుడు, సోదరితో కలిసి ఏడాదిలో 9 రోజులు విడిదికి వస్తాడు. మందిరంలో ఈ ముగ్గురూ ఆసీనులయ్యే సింహాసనాన్ని ‘జన్మబెది’ అంటారు. ఆషాడ యాత్ర పూర్తయిన తర్వాత ఈ ఆలయంలో దుష్టశక్తులు ప్రవేశించకుండా కొన్ని అదృశ్య శక్తులు కాపలాగా ఉంటాయంటారు. ఈ నేపథ్యంలో రథయాత్ర ముందు రోజు భక్తులు కొత్త కలశాలతో తెచ్చిన పవిత్ర జలాన్ని గుండిచా ఆవరణలో చిలకరించి, చీపుర్లతో ఊడ్చి అదృశ్యశక్తులకు ప్రార్థన చేయడం ఆనవాయితీ. ఈ కార్యంలో విదేశీ మహిళలూ పాల్గొనడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని