Puri: వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర.. హాజరైన రాష్ట్రపతి

పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమైంది.

Updated : 07 Jul 2024 21:22 IST

పూరీ: ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమైంది. ఒడిశాతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రథయాత్రను వీక్షించేందుకు తరలిరావడంతో పూరీ పట్టణం జనసంద్రంగా మారింది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా... పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు వేడుకలు ఈరోజే ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్‌ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. స్వామిసేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యలో నిలిపివేస్తారు. మళ్లీ సోమవారం భక్తులు రథాలను లాగుతారు.

రథయాత్రకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

పూరీ రథయాత్రకు గతంలో రాష్ట్రపతులెవరూ రాలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్‌ రఘుబర్‌దాస్‌తో కలిసి రాష్ట్రపతి.. సుభద్రమ్మ రథం లాగారు. ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రెండురోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు.

కిక్కిరిసిన పూరీ వీధులు

ఒడిశాతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు జగన్నాథుని తరలివచ్చారు. దీంతో పూరీ కిక్కిరిసిపోయింది. జై జగన్నాథ్, హరిబోల్‌ నామస్మరణతో అక్కడి వీధులన్నీ మార్మోగుతున్నాయి. రథయాత్ర సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకు రత్నసింహాసనంపై చతుర్థామూర్తులు కొలువు దీరారు. అనంతరం జగన్నాథుని నవయవ్వన రూపాలంకరణ జరిగింది. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాలవల్లభ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై చెరాపహరా (చీపురుతో రథాల ముందు ఊడ్చడం) చేశారు. సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. అనంతరం.. తొలుత బలభద్రుని తాళధ్వజ రథం లాగడంతో లాంఛనంగా రథయాత్ర ప్రారంభమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని