Indian Railway-Kishan Reddy: కిషన్‌రెడ్డి చొరవ.. తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో ఏపీ, తెలంగాణల్లో రెండు సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది.

Updated : 01 Jun 2023 15:08 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో ఏపీ, తెలంగాణల్లో రెండు సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు లేఖ రాసింది. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్‌, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు మార్గాల్లో ఈ సర్వే జరగనుంది. ఈ రెండు లైన్ల పరిధిలో మొత్తం 942 కి.మీ మార్గంలో (గరిష్ఠంగా 220 kmph వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. ఆయా మార్గాల్లో సూపర్‌ఫాస్ట్‌ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్‌ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే తర్వాత ప్రాజెక్టుపై అడుగులు ముందుకు సాగనున్నాయి. ఈ రైల్వే లైన్ల అంశాన్ని కిషన్‌రెడ్డి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి లేఖలు అందజేశారు. ఈ రైల్వే లైన్ల ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధిని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని