Hyderabad: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. కార్లు ధ్వంసం

నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గచ్చిబౌలి, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, అంబర్‌పేట్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది

Updated : 26 May 2022 18:06 IST

హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గచ్చిబౌలి, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, అంబర్‌పేట్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు ఎగిరి పడి అటుగా వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. దీంతో నాంపల్లి ప్రధాన రోడ్డు కూడలిలో 3 కార్లు ధ్వంసం కాగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, దుండిగల్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో వడగండ్ల వర్షం పడింది. సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లి, ఆల్వాల్, తిరుమలగిరి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

రెండు రోజులు వర్షాలు: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దివులు, కొమోరిన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని వాతావరణ కేంద్రం వివరించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్త వరకు స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని