
Raja Cave: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మరో అందమైన గుహలు
మన్యంలో ఓ నవలోకం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మారుమూల గ్రామంలో సహజసిద్ధంగా ఏర్పడ్డ అందమైన గుహలు వెలుగులోకి వచ్చాయి. హుకుంపేట మండలం పామురాయి వద్ద ఉన్నవీటిని స్థానికులు రాజుల గుహలుగా పిలుస్తుంటారు. ప్రవేశమార్గంలో 10 మీటర్ల వెడల్పుతో ఉండి లోపలికు వెళ్తున్న కొద్దీ వెడల్పు పెరుగుతుంది. లోపల మరెన్నో గుహలకు మార్గాలు ఉంటున్నాయి. పెద్ద లైట్లు, కాగడాలతో లోపలకు వెళ్లినా 40 మీటర్లకు మించి వెళ్లలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు. గుహ లోపలభాగం రాయి అంతా అరుణవర్ణంలో ఉండి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెలుతురు ప్రవేశించేవరకు చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు వెళ్తుంటారు.
గతంలో భూపతి రాజులు, జైపూర్ రాజులు ఈ గుహల వద్దకు వేటకు వచ్చేవారని స్థానికులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ వారి పాలనలో స్వాతంత్య్ర సమర యోధులు ఇక్కడి నుంచే పోరాటాలు చేసేవారని చెబుతున్నారు. రాజులు వినియోగించారు కాబట్టే దీనిని రాజుల గుహలుగా పిలుస్తారని తెలిపారు. పర్యటక శాఖ స్పందించి వీటి అభివృద్ధికి నడుంబిగిస్తే ఈ ప్రాంతమంతా ఎంతగానో అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని పామురాయి, కామయ్యపేట గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
చేరుకోవటం ఎలా?: పాడేరుకు సమీపంలో హుకుంపేట మండల కేంద్రం ఉంది. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరం కామయ్యపేట, పామురాయి మీదుగా ముక్తిమామిడి గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కాలినడకన కొండచివరన అర కిలోమీటరు దూరం వెళితే రాజులగుహలు చేరుకోవచ్చు.
- హుకుంపేట, (అరకులోయ) న్యూస్టుడే