Bizzare news: పొట్టేలుకు మూడేళ్ల జైలు.. కారణమిదే!

మహిళ మృతి కేసులో దోషిగా తేలడంతో ఓ పొట్టేలుకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విచిత్ర ఘటన దక్షిణ సూడాన్‌లో వెలుగుచూసింది. స్థానిక వార్తాసంస్థల వివరాల ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో దక్షిణ సూడాన్‌లోని రుంబెక్ ఈస్ట్‌లో...

Published : 24 May 2022 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళ మృతి కేసులో దోషిగా తేలడంతో ఓ పొట్టేలుకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విచిత్ర ఘటన దక్షిణ సూడాన్‌లో వెలుగుచూసింది. స్థానిక వార్తాసంస్థల వివరాల ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో దక్షిణ సూడాన్‌లోని రుంబెక్ ఈస్ట్‌లో 45 ఏళ్ల ఆదియు చాపింగ్‌పై పొరుగింటి పొట్టేలు దాడి చేసింది. పదేపదే తలతో ఢీకొట్టడంతో.. ఆమె తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ జీవిని అదుపులోకి తీసుకున్నారు. ‘ఈ ఘటనలో యజమాని నిర్దోషి. నేరానికి పాల్పడింది పొట్టేలు కాబట్టి.. దాన్ని అదుపులోకి తీసుకున్న’ట్లు వారు వివరించారు.

అనంతరం ఈ కేసులో వాదనలు విన్న స్థానిక కోర్టు.. పొట్టేలును దోషిగా నిర్ధారించింది. అడ్యూల్ కౌంటీ హెడ్‌క్వార్టర్స్‌లోని మిలిటరీ క్యాంప్‌లో మూడేళ్లపాటు ఉంచాలని తీర్పు చెప్పింది. దాని యజమాని.. బాధితురాలి కుటుంబానికి అయిదు ఆవులనూ పరిహారంగా అప్పగించాలని ఆదేశించింది. మరోవైపు.. స్థానిక సంప్రదాయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని చంపిన పెంపుడు జంతువును అతని కుటుంబానికే పరిహారంగా ఇస్తారు. దీని ప్రకారం శిక్ష అనంతరం.. ఆ జీవిని బాధితురాలి కుటుంబానికే అప్పగించనున్నారు. ఇదిలా ఉండగా.. పొట్టేలు దాడిలో మనుషులు మృతి చెందడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అమెరికాలోనూ ఓ మహిళ పొలంలో పొట్టేళ్ల దాడిలో మరణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని