దిల్లీ షాపింగ్‌మాల్‌లో.. ‘రామ మందిరం’ 

పండగల వేళ కస్టమర్లను ఆకర్షించేందుకు షాపింగ్‌మాల్స్‌ ఆఫర్లు, ఆకట్టుకునే కార్యక్రమాలు ప్రకటిస్తుంటాయి. షాపింగ్‌మాల్స్‌ను అందంగా అలంకరిస్తుంటాయి. ఈ క్రమంలోనే దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని దిల్లీలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఏకంగా అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర నిర్మాణం నమూనా

Published : 26 Oct 2020 00:44 IST


(ఫొటో: పసిఫిక్‌ మాల్‌ ఫేస్‌బుక్‌)

దిల్లీ: పండగల వేళ కస్టమర్లను ఆకర్షించేందుకు షాపింగ్‌ మాల్స్‌ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.. విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.. షాపింగ్‌మాల్స్‌ను అందంగా అలంకరిస్తుంటాయి. ఈ క్రమంలోనే దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని దిల్లీలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఏకంగా అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర నిర్మాణం నమూనాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అయోధ్య ఆలయం నమూనా అక్కడికి వెళ్లే కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. 

పశ్చిమ దిల్లీలోని పసిఫిక్‌ షాపింగ్‌మాల్‌ యాజమాన్యం.. మాల్‌ మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో 32 అడుగుల ఎత్తు, 48 అడుగుల వెడల్పు ఉన్న అయోధ్య రామ మందిరం నమూనాను ఏర్పాటు చేసింది. దీన్ని రూపొందించడానికి 80 మంది నిపుణులు 45 రోజులు కష్టపడ్డారట. ఆలయం నమూనా ఏర్పాటుపై మాల్‌ మేనేజర్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల్లో సంతోషం నింపడానికి, వారికి చక్కటి వాతావరణం కల్పించడం కోసం ఏటా షాపింగ్‌ మాల్‌ను వినూత్నంగా అలంకరిస్తుంటాం. మాల్‌ సిబ్బంది, యాజమాన్యం, విక్రయదారులతో చర్చలు జరిపి ఈ ఏడాది మరింత వినూత్నంగా, పండగ కళ ఉట్టిపడే విధంగా ఏదైనా చేయాలనుకున్నాం. అందుకే ఈ ఆలయ నమూనాను ఏర్పాటు చేశాం’’అని చెప్పారు.

అయోధ్యలో నిర్మిస్తోన్న అసలు రామ మందిరం.. మూడు అంతస్తులతో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తు ఉండనుంది. ఈ రామ మందిరం నిర్మాణానికి గత ఆగస్టు నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆలయ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని