Andhra News: తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు.. రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్‌

తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్‌ చేశారు.

Published : 28 Sep 2022 16:39 IST

తిరుమల: తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్‌ చేశారు. తితిదేలోని బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఆలయ విధానాలతో పాటు, అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని కోరారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కమిటీ సిఫార్సులపై సీఎం జగన్‌ ప్రకటన చేయకపోవడం నిరాశపర్చిందని పేర్కొన్నారు.

తితిదే పరిధిలోని ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అర్చకత్వం చేయడం కష్టంతో కూడుకున్న పని అని, 60 ఏళ్లు దాటిన వారికి వారి వంశంలోని కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. వంశపారంపర్య అర్చకత్వం కొనసాగించాలని రమణ దీక్షితులు కోరుతున్నారు. అర్చకులకు పదవీవిరమణ వయసు ఉండదని, వారు చేయగలిగినంతకాలం చేస్తారని ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టులో ఈ కేసు కొనసాగుతుండగానే రమణదీక్షితులుతో పదవీ విరమణ చేయించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగింది. ఆ తరువాత తితిదేపై రమణ దీక్షితులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను గౌరవ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 

దీంతో తిరిగి రమణ దీక్షితులు తిరుమల ఆలయంలో కీలకంగా వ్యవహరిస్తారని భావించారు.  కానీ, గౌరవ ప్రధాన అర్చకులుగా నియామకం చేసినప్పటికీ తిరుమల ఆలయంలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా తితిదేలోని కొందరు అధికారులు, అర్చక వ్యవస్థపై సామాజిక మాధ్యమాల వేదికగా వివాదాస్పద ట్వీట్‌లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపింది.  బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించి తిరిగి వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే రమణదీక్షితులు ట్వీట్‌ చేయడం దుమారం రేపింది. వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2021 జులైలో జస్టిస్‌ శివశంకర్‌ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేసింది. 3 నెలల్లో వంశపారంపర్య అర్చకత్వంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిషన్‌కు సూచన చేసింది. ఆమేరకు జస్టిస్‌ శివశంకర్‌ దీనిపై పూర్తి స్థాయిలో నివేదికను సీల్డు కవర్‌లో సమర్పించారు. ఆ వివరాలను ప్రభుత్వం ఇప్పటి వరకు వెల్లడించలేదు. కమిటీ సిఫార్సులపై సీఎం జగన్‌ ప్రకటన చేయాలని రమణ దీక్షితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts