Rammohan Naidu: రికార్డు సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

Updated : 13 Jun 2024 16:03 IST

దిల్లీ: తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. దిల్లీలోని రాజీవ్‌ గాంధీ భవనలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘క్యాబినెట్‌లో అత్యంత చిన్న వయసులో ఉన్న నాపై బాధ్యత పెట్టారు. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం. పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనున్నాం. సాంకేతిక వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్‌ ఆఫ్‌ ఫ్లయింగ్‌ తీసుకువస్తాం. ప్రయాణికుడికి భద్రత, సౌకర్యంగా ఉండేలా చూస్తాం. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఎంపీగా పని చేశా. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నా.

ఎయిర్‌పోర్టులను పర్యావరణ హితంగా చేయడానికి చర్యలు తీసుకుంటాం. టైర్‌2, టైర్‌3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకురావడం, విమానయానం సామాన్య ప్రయాణికుడికి అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. అశోక్‌ గజపతి రాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంతో పాటు ఏపీలోనూ విమానయానానికి అద్భుతంగా పునాదులు వేశారు. ఉడాన్‌ స్కీమ్‌ కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అమలు చేసి టైర్‌2, టైర్‌3 సిటీలతో పాటు సామాన్యుడికి విమానయాన అవకాశం కల్పించారు. దీన్ని మరింత విస్తరిస్తాం.

విజనరీ లీడర్స్‌ ఉండటం నాకు కలిసొస్తుంది

ఓ వైపు ప్రధాని మోదీ, మరో వైపు పక్కన చంద్రబాబు లాంటి విజనరీ లీడర్స్‌ ఉండటం నాకు కలిసొచ్చే అంశం. దేశ ప్రజలు గర్వపడేలా బాధ్యతలు నిర్వర్తిస్తా. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అశోక్‌ గజపతిరాజు హయాంలో పునాది పడింది. గత ఐదు సంవత్సరాల్లో అక్కడ అభివృద్ధి కుంటుపడింది. రికార్డు సమయంలో ఆ ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేసి విమానాలను ల్యాండ్‌ చేస్తాం. వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ కనెక్టివిటీని మరింత పెంచుతాం. రాజమహేంద్రవరం, కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి అక్కడి విమానయాన శాఖ కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తాం’’ అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని