TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు

తిరుమలలో నిర్వహించిన రథ సప్తమి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా తితిదే అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Updated : 28 Jan 2023 22:28 IST

తిరుమల: సూర్యజయంతి సందర్భంగా తిరుమల (Tirumala)లో శనివారం నిర్వహించిన రథసప్తమి  వేడుకలకు  భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డులో కూర్చొని భక్తులు వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించారు. శ్రీవారి సేవ‌కులు.. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. వాహనసేవలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు గ్యాలరీల్లో కల్పించిన సౌకర్యాలను తితిదే (TTD) జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 

భక్తుల రద్దీకి అనుగుణంగా తితిదే అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 850 మంది తితిదే నిఘా, భద్రతా సిబ్బంది, 500 మంది పోలీసులతో భద్రత కల్పించారు. 3,000 మంది శ్రీవారి సేవకులు, 300 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందించారు. 

24 గంటల్లో పదిలక్షలకుపైగా డౌన్‌లోడ్స్‌..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం విడుదల చేసిన ‘TTDevasthanams’ మొబైల్ యాప్‌ను కేవలం 24 గంటల్లో సుమారు పది లక్షలకు పైగా యూజర్స్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత మంది యూజర్లు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఐటీ చరిత్రలో చాలా అరుదు అని  ఐటీ నిపుణులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని