Rainfall: ముంబయిలో రెడ్‌ అలర్ట్‌..!

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముంబయిలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఈ  మేరకు భారత వాతావరణ శాఖ

Published : 19 Jul 2021 16:45 IST

ముంబయి: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముంబయిలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఈ  మేరకు భారత వాతావరణ శాఖ ముంబయి విభాగం ప్రధాన అధికారి డాక్టర్‌ జయంత్‌ సర్కార్‌ సోమవారం వెల్లడించారు. మంగళవారం నుంచి రెండు రోజులపాటు నగరంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపారు. నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన పలు ఘటనల్లో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో నగరంలోని 407 శిథిల భవనాలను ముంబయి మహానగర పాలక సంస్థ ముందస్తుగానే గుర్తించింది. అయితే వాటిలో ఇప్పటివరకు 150 భవనాలను మాత్రమే కూల్చింది.

ముంబయిలో ఆదివారం కురిసిన భారీ వర్షం సోమవారం ఉదయానికి కాస్త నెమ్మదించింది. మళ్లీ ఈ ఉదయం వర్షం తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టాలపై నీరు ప్రవహిస్తుండటంతో స్థానికంగా పలు రైల్వే సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉదయం నిర్ణీత సమయం పాటు పలు రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు ఈ నెల వచ్చే గురువారం వరకు మహారాష్ట్ర-గోవా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అవి గంటకు 65 కిలోమీటర్ల వరకు వేగం పుంజుకునే అవకాశం ఉందని ముంబయిలోని ఓడరేవు హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే  ఆదివారం సమీక్షించారు. శిథిల భవనాలు, కొండ చరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని