AP High Court: చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట

ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌కు ఊరట లభించింది.

Updated : 04 May 2022 12:45 IST

అమరావతి: ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేసులో తదుపరి చర్యలపై ధర్మాసనం స్టే ఇచ్చింది. వారం క్రితం చింతలపూడిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చింతమనేని హైకోర్టును ఆశ్రయించారు. కార్యక్రమంలో భాగంగానే నిరసనలో పాల్గొన్నట్లు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా ఎటువంటి చర్యలకు పాల్పడలేదని చింతమనేని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకంటే?

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ అంకంపాలెంలో గత సోమవారం రాత్రి నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన మాట్లాడారు. స్థానిక సర్పంచి, ఉప సర్పంచితో పాటు వైకాపా నాయకులు అక్కడకు వెళ్లి, తమ నాయకుడిని అవమానిస్తారా, ఇక్కడ మీకేంటి పని అంటూ వాగ్వాదానికి దిగారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకుందని చింతమనేని చెప్పడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంలో చింతమనేని తనను కులం పేరుతో దూషించారని సర్పంచి తొమ్మండ్రు భూపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని