కరోనా కాలం: చేపల చెరువుగా స్విమ్మింగ్‌పూల్‌!

కరోనా నేపథ్యంలో పర్యాటక రంగం కుదేలైంది. దీంతో పర్యాటకులకు బస కల్పించే రిసార్టులు గత ఆరు నెలలుగా మూతపడే ఉన్నాయి. రిసార్టుల యజమాన్యాలు ఆదాయం లేక.. అక్కడి సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఆర్థికంగా...

Published : 29 Aug 2020 01:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నేపథ్యంలో పర్యాటక రంగం కుదేలైంది. దీంతో పర్యాటకులకు బస కల్పించే రిసార్టులు గత ఆరు నెలలుగా మూతపడే ఉన్నాయి. రిసార్టుల యజమాన్యాలు ఆదాయం లేక.. అక్కడి సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అలాంటి ఇబ్బందే పడ్డ ఓ రిసార్టు యాజమాన్యం సరికొత్త ఆలోచన చేసింది. రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌ను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉపయోగిస్తోంది.

కేరళలోని కుమరకోమ్‌లో ‘ది అవేదా రిసార్ట్స్‌ అండ్‌ స్పా’ రిసార్టులో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌ను రిసార్టు యాజమాన్యం చేపల చెరువుగా మార్చింది. అందులో చేపల్ని పెంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి ఆదాయం పొందాలని భావిస్తోంది. కరోనా దృష్ట్యా మార్చిలో ఈ రిసార్టు మూతపడటంతో ఆదాయం లేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేకపోయారట. కొద్ది నెలలు వేచి చూసినా ఇప్పట్లో రిసార్టు తెరిచే అవకాశాలు లేకపోవడంతో మరో ఆదాయ వనరు కోసం ఆన్వేషించగా ఈ ఉపాయం తట్టిందట.

దీంతో రిసార్టులో ఉన్న 7.5 మిలియన్‌ లీటర్ల నీరు పట్టే 150x50 మీటర్ల విస్తీర్ణం గల స్విమ్మింగ్‌పూల్‌లో జూన్‌ నెలలో 16వేల పెరల్‌ ఫిష్‌ చేప పిల్లల్ని వదిలారు. వీటి ద్వారా 4 మిలియన్‌ టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తారట. వీటిని విక్రయించగా వచ్చిన డబ్బును ఉద్యోగుల జీతాలు, రిసార్టు నిర్వహణ ఖర్చులకు వినియోగించాలనుకుంటున్నారు. ఒకవేళ ఆదాయం బాగుంటే పర్యాటక రంగం పునఃప్రారంభమైనా.. ఈ రిసార్టులో కాకుండా వేరే ప్రాంతాల్లో ఈ చేపల ఉత్పత్తిని కొనసాగిస్తామని అవేదా రిసార్ట్స్‌ యాజమాన్యం చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని