ఆ రోడ్డు కింద మీటరు‌కో మృతదేహం ఉంది..!

బాహుబలి సినిమాలో బిజ్జలదేవ పాత్ర పోషించిన నాజర్‌.. భళ్లాలదేవ విగ్రహం ఏర్పాటు సమయంలో ఒక డైలాగ్‌ చెప్తాడు ‘వంద అడుగుల బంగారు విగ్రహం.. వందమందిని బలికోరదా?’’అని. ఈ మాట రష్యాలోని ఒక రోడ్డు నిర్మాణంలో సరిగ్గా సరిపోయింది. 2వేల కి.మీమేర పొడవున్న ఆ రోడ్డు

Updated : 14 Mar 2021 12:58 IST


(ఫొటో: గూగుల్‌ మ్యాప్స్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాహుబలి సినిమాలో బిజ్జలదేవ పాత్ర పోషించిన నాజర్‌.. భళ్లాలదేవ విగ్రహం ఏర్పాటు సమయంలో ఒక డైలాగ్‌ చెప్తాడు ‘వంద అడుగుల విగ్రహం.. వంద తలలైనా బలికోరదా?’’అని. ఈ మాట ఓ రోడ్డు నిర్మాణంలో సరిగ్గా సరిపోయింది. 2వేల కి.మీ మేర పొడవున్న ఆ రోడ్డు రెండున్నర లక్షల మందిని బలితీసుకుంది. అంతకన్నా దయనీయం ఏంటంటే.. వారికి ఎలాంటి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా.. దారిలోనే పాతిపెట్టి మృతదేహాలపై రోడ్డు వేయడం. అందుకే దాన్ని ఎముకల రహదారి(రోడ్‌ ఆఫ్‌ బోన్స్‌)అని పిలుస్తుంటారు. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ ఉంది? అంత మందిని ఎందుకు పాతిపెట్టారు..? 

రష్యాలోని కొలిమా ప్రాంతంలో బంగారు గనులు, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభ్యం అయ్యేవి. వాటిల్లో ఒకప్పటి రష్యా అధినేత స్టాలిన్‌ రాజకీయ ఖైదీలతో పనిచేయించేవారు. అయితే, అప్పట్లో ప్రధాన నగరంగా ఉండే కబరోస్క్‌ నుంచి కొలిమా ప్రాంతానికి వెళ్లడానికి, అక్కడ వెలికి తీసిన బంగారాన్ని తీసుకురావడానికి సముద్రమార్గం ఒక్కటే ఉండేది. ఓడల్లో రవాణా చాలా ఆలస్యమవుతుండటంతో ఒక రోడ్డు నిర్మాణం చేపట్టాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. కబరోస్క్‌ నుంచి నీషి బెస్ట్‌యాక్‌ వరకు అప్పటికే రహదారి ఉంది. దీంతో నిషీ బెస్ట్‌యాక్‌ నుంచి కొలిమా వరకు, అక్కడి నుంచి తీరప్రాంతమైన మగడాన్‌ వరకు రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. దీని పొడవు 2,031కి.మీ. ఈ రోడ్డు నిర్మాణానికి కూడా రాజకీయ ఖైదీలనే పురమాయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొలిమా ప్రాంతంలో రాజకీయ ఖైదీలతో 80 క్యాంప్‌లు ఏర్పాటు చేసి 1932లో నిర్మాణ పనులు మొదలుపెట్టారు.


(ఫొటో: గూగుల్‌ మ్యాప్స్‌)

అయితే, రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్‌ 50 డిగ్రీల్లో ఉండేదట. వేసవికాలంలో దోమలు ఖైదీలపై దాడి చేసి రక్తం పీల్చేసేవి. ఇలా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తూ రోజుకు కనీసం పాతికమంది ఖైదీలు మరణించేవారట. వారిని వెనక్కి తీసుకెళ్లి, అంతిమ సంస్కారాలు జరిపించాలంటే శ్రమ పెరుగుతుంది. అందుకే చనిపోయిన వారిని చనిపోయిన చోటే దారిలో.. దారి పక్కన గుంతలు తవ్వి అందులో పాతిపెట్టేసి వాటిపై రోడ్డు వేసేవారు. అలా మీటరుకో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తవడానికి 20ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో 2.5లక్షల మందికిపైగా ఖైదీలు మృతి చెందారని, వారందరినీ రోడ్డు కిందే పాతిపెట్టారని చెబుతున్నారు.

ఇప్పటికీ ఈ రోడ్డు P504 జాతీయ రహదారిగా ప్రయాణికులకు అందుబాటులో ఉంది. అయితే, ఈ రోడ్డపై ప్రయాణించడమంటే రిస్క్‌ తీసుకున్నట్లే. ఎందుకంటే ఈ రోడ్డు శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ తర్వాత మంచు కరిగి రోడ్డుపై గుంతలు ఏర్పడతాయి. మరోవైపు దారిపొడవున ఎలుగుబంట్లు దాడి చేసే అవకాశాలున్నాయి. అయినా, కొంతమంది సాహస యాత్రికులు ఈ రోడ్డుపై ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రయాణానికి జీపులు అనువుగా ఉంటాయి. అందుకే, మగడాన్‌లో వీటిని అద్దెకిస్తుంటారు. అలాగే, స్థానిక గైడ్స్‌ కొలిమా హైవే టూర్స్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు