Updated : 08 May 2021 12:30 IST

చిన్నారికి మేమున్నామంటూ.. రూ.16కోట్ల విరాళాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎంత పెద్ద రాజ్యాలు సంపాదించినా చివరికీ మూటగట్టుకొని పోయేదేమీ ఉండదు కదా’ అంటూ భాగవతంలో శుక్రాచార్యుడితో బలి చక్రవర్తి అన్న మాటల దాతృత్వానికి, దాన గుణానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తాయి. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ చిన్నారి విషయంలో దాతలు స్పందించిన తీరు చూస్తే ఈ మాటలు గుర్తురాక మానదు. సాధారణంగా రూ.లక్ష, రూ. రెండు లక్షల విరాళాలు వైద్య ఖర్చుల నిమిత్తం సమకూరుస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం ఏకంగా రూ.16 కోట్లు ఇచ్చిన దాతలు ఇంకా మనుషుల్లో మానవత్వం మిగిలే ఉందని మరోసారి నిరూపించారు.  వివరాల్లోకి వెళితే...

అహ్మదాబాద్‌కు చెందిన ధైర్యరాజ్‌ సింగ్‌ రాథోడ్‌ అనే ఐదు నెలల బాబు పుట్టుకతోనే అత్యంత అరుదైన స్పైనల్‌ మస్కులార్‌ ఆంట్రోఫీ టైప్‌-1 రుగ్మతతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సరైన సమయంలో చికిత్స చేయలేకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధితో బాధపడేవారు రెండేళ్ల కంటే ఎక్కువ బతకడం కష్టమని డాక్టర్లు వివరించారు. దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక్క ఔషధం ‘జోల్‌జెన్‌స్మా’. ఈ ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఖరీదు రూ.16 కోట్లు.

విషయం చెప్పగానే చిన్నారి తల్లిదండ్రుల గుండె ఆగినంత పనయింది. వారి దగ్గర ఉన్న ఆస్తి, పొదుపు మొత్తం కలిపినా దానిలో సగం కూడా విలువ చేయదు. ఇక తమ బాబును బతికించుకోవడం సాధ్యం కాదనే భావించారు. కానీ, రెండు లక్షల మంది దాతలు వారి ఆశల్ని బతికించారు. తమ బాబుకు ప్రాణం పోసేందుకు ముందుకు వచ్చారు. ఆ ఖరీదైన ఇంజెక్షన్‌కు కావాల్సిన రూ.16 కోట్లను 42 రోజుల్లో సమకూర్చారు. దీంతో గత బుధవారం వైద్యులు చిన్నారికి ఆ ఇంజెక్షన్‌ను అందజేశారు. ఈ విరాళాల సేకరణలో వారికి ‘ఇంపాక్ట్‌గురు’ అనే స్వచ్ఛంద సంస్థ సహకరించింది. దాతల్లో ఎవరూ మిలియనీర్లు కాదని.. అంతా సామాన్య ప్రజలే అని ఇంపాక్ట్‌గురు గుర్తించింది. మొత్తం 2.64 లక్షల మంది విరాళాలిచ్చి తమ బాబును గండం నుంచి గట్టెక్కించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

అవెక్సిస్‌ అనే అమెరికా అంకుర సంస్థ జోల్‌జెన్‌స్మాను అభివృద్ధి చేసింది. అమెరికా సహా యూకేలో వినియోగానికి అనుమతి లభించింది. దీన్ని బాధితుడి శరీరంలోకి ఒకేసారి ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వడం ద్వారా చచ్చుబడి ఉండే ఎస్‌ఎంఎన్‌1 అనే జన్యువు క్రియాశీలకమవుతుందని నిపుణులు తెలిపారు. దీంతో పిల్లల్లో కండరాల కదలికలకు సహకరించే నరాలకు సంబంధించిన ప్రోటీన్ల ఉత్పత్తి జరుగతుందని వివరించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని