Tirumala: యాచకుడి ఇంట్లో రూ.10లక్షలు

తిరుమలోని ఓ బిచ్చగాడి ఇంటిలో రూ.10లక్షలు బయటపడిన ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Published : 18 May 2021 01:47 IST

మంగళం(చిత్తూరు): తిరుమలోని ఓ బిచ్చగాడి ఇంటిలో రూ.10లక్షలు బయటపడిన ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తిరుమలలో యాచన చేస్తూ జీవనం సాగించిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఇంటి నుంచి తితిదే విజిలెన్స్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసాచారికి 2007లో తిరుమల సమీపంలోని శేషాచలనగర్‌లో ఇంటి నెం.75ను పొందాడు. అప్పటి నుంచి తిరుమలలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ యాచిస్తూ భారీగా నగదును పోగు చేసుకున్నాడు. తాను సంపాదించిన సొమ్మును ఇంట్లోనే భద్రపరుచుకుంటూ వచ్చాడు.

గత సంవత్సరం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు వారసులు ఎవరూ లేకపోవడంతో తితిదే సదరు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగానే సోమవారం తితిదే విజిలెన్స్‌ అధికారులు రెవెన్యూ అధికారులు శేషాచలనగర్‌కు చేరుకొని తనిఖీలు చేశారు.

ఇందులో భాగంగానే ఇంటిలోని వస్తువులను తనిఖీ చేయగా రెండు ట్రంకు పెట్టెల్లో చిల్లర నగదు, కరెన్సీ నోట్లు పెద్దఎత్తున కనిపించాయి. ఇందులో రద్దు చేసిన రూ.1,000 నోట్లు, పాత నోట్లు ఉండటం విశేషం. సుమారు రూ.10లక్షలు వరకు ఉన్న నగదును తితిదే స్వాధీన పర్చుకుని ట్రెజరీకి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని