Sahitya Akademi Awards: సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

అనువాద రచనల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ (Sahitya Akademi) పురస్కారాలను ప్రకటించింది. 2021 ఏడాదికి గాను అనువాద రచనలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం తెలుగు అనువాదకురాలు, సామాజిక.....

Updated : 25 Jun 2022 00:13 IST

దిల్లీ: అనువాద రచనల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ (Sahitya Akademi) పురస్కారాలను ప్రకటించింది. 2021 ఏడాదికి గానూ తెలుగు అనువాద రచనలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం సామాజిక ఉద్యమకారణి, రచయిత్రి కె.సజయను వరించింది. ప్రముఖ రచయిత్రి భాషా సింగ్‌ హిందీలో రాసిన అదృశ్య భారత్‌ (నాన్‌ఫిక్షన్‌) పుస్తకాన్ని తెలుగులో ‘అశుద్ధ భారత్‌’ పేరుతో అనువదించిన కె.సజయను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాహిత్య అకాడమీ వెల్లడించింది. ఈ పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ.50వేల నగదును అందజేయనున్నారు. 2021లో అనువాద రచన ఎంపికకుగానూ జ్యూరీ సభ్యులుగా ఆ ప్రొఫెసర్‌. ఎస్‌ శేషారత్నం, వై.ముకుంద రామారావు, డా. గుమ్మ సాంబశివరావు వ్యవహరించారు. 22 భాషల్లో అనువాద పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను శుక్రవారం విడుదల చేసిన సాహిత్య అకాడమీ.. మైథిలి,  రాజస్థానీ భాషలకు సంబంధించిన అనువాద పురస్కార విజేతలను త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపింది.

దేశవ్యాప్తంగా సఫాయి వర్కర్ల హృదయ విధారక జీవన స్థితిగతులను వివరిస్తూ ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి భాషా సింగ్ రాసిన పుస్తకాన్ని సజయ తెలుగులోకి అనువదించారు. 2018లో వివిధ సాహిత్య ప్రక్రియల్లో ఉత్తమ రచనలకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద విభాగంలో విశిష్ట పురస్కారాన్ని సజయకు అందజేసింది. సుప్రసిద్ధ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త భాషా సింగ్‌ రాసిన ‘అదృశ్య భారత్‌’ హిందీలో వెలువడగా.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మనదేశంలో నేటికీ కొనసాగుతున్న మాన్యువల్‌ స్కావెంజింగ్‌ గురించి ఆధార సహితంగా పట్టిచూపిన ఈ పరిశోధనాత్మక గ్రంథాన్ని సజయ తెలుగులోకి అనువాదం చేశారు. దీన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ‘అశుద్ధ భారత్‌’ శీర్షికన  ప్రచురించింది. దేశంలో తరతరాలుగా సఫాయి వర్కర్లు అనుభవిస్తున్న బాధావ్యధల గాథలు, వారి వాస్తవ జీవనానికి అక్షర రూపమే ‘అశుద్ధ భారత్‌’ పుస్తకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని