
AP News: అపోహలు తొలగించేందుకే చర్చలకు రమ్మన్నాం: సజ్జల
అమరావతి: ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కమిటీ ఏర్పాటైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీపై అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అమరావతిలో మీడియాతో సజ్జల మాట్లాడారు. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని సంఘాలు కోరాయని.. ముందుగా చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలమన్నారు. కమిటీని అధికారికంగా ప్రకటించేవరకు వచ్చేది లేదని చెప్పారని.. రేపు కూడా వారితో చర్చలకు వేచిచూస్తామని తెలిపారు. మరోసారి ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందిస్తామన్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి ఫోన్ చేసిన చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా అంటారని సజ్జల ప్రశ్నించారు.
ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమ్మె విషయంలో ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు. ఉద్యోగుల బుజ్జగింపు, చిన్న అంశాల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందని చెప్పారు. ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో నోటీస్ పిరియడ్కు అర్థం ఉండదని.. అలా చేస్తే క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.