Indian Railway: ఈ రైళ్ల వేగం పెరిగింది.. ద.మ.రైల్వే వెల్లడి

దక్షిణ మధ్య రైల్వే(SCR) పరిధిలో కొత్తగా ఆరు రైళ్ల(Trains)ను ప్రవేశపెట్టారు. దీంతోపాటు కొన్ని రైళ్లను ప్యాసింజర్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌లుగా, ఎక్స్‌ప్రెస్‌ల నుంచి సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు....

Updated : 30 Sep 2022 21:48 IST

హైదరాబాద్‌- ముంబయి రైలు 85 నిమిషాలు ముందుగానే..

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే(SCR) పరిధిలో కొత్తగా ఆరు రైళ్ల(Trains)ను ప్రవేశపెట్టారు. దీంతోపాటు కొన్ని రైళ్లను ప్యాసింజర్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌లుగా, ఎక్స్‌ప్రెస్‌ల నుంచి సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. మరికొన్ని రైళ్ల వేగాన్ని పెంచారు. వీటిలో కొన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ద.మ.రైల్వే శుక్రవారం విడుదల చేసింది. మరోవైపు, రైళ్లకు సంబంధించిన కొత్త పబ్లిక్ టైం టేబుల్(Time Table)  అక్టోబర్‌ 1(రేపు)నుంచి  అమల్లోకి రానుంది. సంబంధిత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్(www.irctc.co.in), నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్(NTES)లను సందర్శించాలని, లేదా సంబంధిత రైల్వే స్టేషన్లలో ఎంక్వైరీ కౌంటర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

కొత్త రైళ్ల వివరాలు..

దక్షిణ మధ్య రైల్వే మీదుగా మొత్తం ఆరు రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టారు. వాస్కోడాగామా- జసీడీహ్‌(వీక్లీ), జసీడీహ్‌- ఎస్‌ఎంవీటీ బెంగళూరు(వీక్లీ), కాచిగూడ- మెదక్‌ (డైలీ)ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

12 రైళ్లు పొడిగింపు

కర్నూలు సిటీ- సికింద్రాబాద్ రైలును హైదరాబాద్‌(నాంపల్లి) వరకు పొడిగించారు. అలాగే, గుంటూరు- కాచిగూడను సికింద్రాబాద్‌ వరకు, సిర్పూరు టౌన్‌- కాజీపేటను బల్లార్షా వరకు, కాచిగూడ- మేడ్చల్‌ను మెదక్‌ వరకు.. ఇలా మొత్తం 12 రైళ్లను ఆయా స్టేషన్‌ల వరకు ఇప్పటికే పొడిగించారు.

వేగం పెరగనున్నవి..

మొత్తం 31 రైళ్ల వేగం పెంచనున్నారు. దీంతో ఆయా ట్రైన్లలో ప్రయాణికులకు కనిష్ఠంగా 5 నిమిషాల నుంచి గరిష్ఠంగా గంటన్నరపాటు సమయం ఆదా కానుంది. సీఎస్‌టీ ముంబయి- కేఎస్‌ఆర్‌ బెంగళూరు(11301) రైలు ఇకనుంచి గంటన్నర ముందుగానే చేరుకోనుంది. హైదరాబాద్‌ - సీఎస్‌టీ ముంబయి(22731)లో 85 నిమిషాలు, కాచిగూడ- కర్నూలు సిటీ(17435)లో 35 నిమిషాలపాటు ప్రయాణ సమయం తగ్గనుంది.

సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌లుగా మారినవి..

హైదరాబాద్‌- సీఎస్‌టీ ముంబయి(22731), సీఎస్‌టీ ముంబయి- హైదరాబాద్‌(22732) రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. రేపటి నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతోపాటు 36 ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. మచిలీపట్నం- విశాఖపట్నం, కాచిగూడ- కర్నూలు సిటీ, సికింద్రాబాద్‌- రేపల్లె, గుంటూరు- సికింద్రాబాద్‌, హుబ్లీ- విజయవాడ తదితర ప్యాసింజర్‌ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని