Updated : 31 Dec 2020 16:34 IST

అక్కడ 2021 వచ్చేసింది.. 

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించిన న్యూజిలాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలగర్భంలో మరో ఏడాది, మరో దశాబ్దం కలిసిపోతోంది. మరికొద్ది గంటల్లో భారత్‌లో నూతన సంవత్సరం మొదలుకానుంది. అయితే మనకంటే ముందే కొన్ని దేశాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాయి. పసిఫిక్‌ మహా సముద్రంలోని ‘సమోవా’ ద్వీపం అందరికంటే ముందుగా 2021ని ఆహ్వానించింది. మన కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వచ్చేసింది. కాసేపటికే టోంగా, కిరిబాటి దీవులు కూడా 2021లోకి అడుగుపెట్టాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌ కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించింది. భారత్‌లో సాయంత్రం 4.30 గంటలు అవుతున్నప్పుడు వెల్లింగ్టన్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ప్రపంచ కాలమానం ఇంగ్లాండ్‌లోని గ్రీన్‌విచ్‌ రేఖాంశం నుంచి ప్రారంభమవుతుంది. ఇది సున్నా డిగ్రీలుగా ఉంటుంది. ఈ రేఖాంశాల ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. మన దేశంలో 82.5°E  ప్రకారం ఐఎస్‌టీ సమయం ఉంటుంది.

ఏయే దేశాల్లో ఎప్పుడు..

ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇక సూర్యోదయ భూమిగా పేరున్న జపాన్‌ కూడా మూడున్నర గంటల ముందే 2021లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. భారత్‌ పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లు 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.

ఒకేసారి 43 దేశాల్లో..

సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2021లోకి అడుగుపెడతాం. అదే సమయానికి భారత్‌తో పాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.

చివరగా అక్కడే..

భారత్‌ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. ఇక కొత్త సంవత్సరం ఆఖరిగా వచ్చే భూభాగం అమెరికా పరిధిలోని బేకర్‌, హోవార్డ్‌ దీవులు. అయితే ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అమెరికన్‌ సమోవాను చివరిదిగా పరిగణిస్తారు.

ఇవి ప్రత్యేకం..

రష్యాలో నూతన సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకొంటారు. ఒకటి జనవరి 1(కొత్త క్యాలెండర్‌ ప్రకారం). రెండోది జనవరి 14(పాత జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం). ఇక నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోని దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, వియత్నాంలు ఉన్నాయి. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్‌ వేడుకలు జరుగుతాయి. 

వేడుకలపై కరోనా పంజా

కరోనా మహమ్మారి కారణంగా ఈసారి యావత్‌ ప్రపంచం నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగానే జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా అనేక దేశాలు వేడుకలపై ఆంక్షలు, షరతులు విధించాయి. దీంతో పలు పర్యాటక ప్రాంతాలు వేడుకలు లేక వెలవెలబోతున్నాయి.

ఇవీ చదవండి..

న్యూఇయర్‌ వేళ.. మూగబోయిన ప్రపంచం

దిల్లీలో కొత్త సంవత్సర వేడుకలకు చెక్‌

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని