Telangana News: పెరిగిన ఎండల తీవ్రత... బడి వేళలు తగ్గించిన విద్యాశాఖ

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. కుమురంభీమ్‌ జిల్లాలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది.

Updated : 30 Mar 2022 20:58 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. కుమురంభీమ్‌ జిల్లాలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. గురువారం నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు ఏప్రిల్‌ 6 వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది.

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌

రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీరాజ్‌, విద్యాశాఖల కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ మాణిక్‌ రాజ్‌, భారత వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్న కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కవ అవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రానున్న రెండ్రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. సరిపడా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని సీఎస్‌ కలెక్టర్లకు సూచించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఉపాధిహామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని