SC railway: రైల్వేశాఖ కీలక నిర్ణయం... పార్శిల్‌ కార్యాలయంలో స్కానింగ్‌ సిస్టం

దక్షిణ మధ్య రైల్వేలో మొదటి సారిగా పార్శిల్‌ స్కానర్‌ను నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ వినూత్న

Published : 15 Jun 2022 02:05 IST

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేలో (South central railway) మొదటి సారిగా పార్శిల్‌ స్కానర్‌ను నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ వినూత్న వ్యవస్థను ద.మ.రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌ డివిజన్‌లో ప్రారంభించారు. రైళ్లలో పార్శిల్‌ రవాణా చేసేందుకు ఇటీవల భారతీయ రైల్వే అనేక ఆకర్షణీయమైన విధానాలను తీసుకొచ్చింది. ప్రధానంగా ద.మ.రైల్వే పరిధిలో పార్శిల్‌ రవాణా భారీగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం పార్శిల్‌ రవాణాలో భద్రతా పరమైన చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని పార్శిల్‌ కార్యాలయంలో పార్శిల్‌ స్కానర్‌ను ఏర్పాటు చేయాలనే కీలక నిర్ణయం తీసుకొని చర్యలు చేపట్టింది.

భారతీయ రైల్వే న్యూ ఇన్నోవేటివ్‌ నాన్‌ ఫేర్‌ రెవెన్యూ ఐడియాస్‌ స్కీమ్‌లో భాగంగా ఇక్కడ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పార్శిల్‌ బుక్‌ చేసే ముందు కచ్చితంగా స్కానింగ్‌ చేస్తారని అధికారులు తెలిపారు. ఒక సారి స్కానింగ్‌ పూర్తయిన తర్వాత వాటిపై స్టిక్కర్లు లేదా స్టాంపులు అంటిస్తారు. స్కాన్‌ చేసిన ప్యాకేజీలు మాత్రమే బుకింగ్‌, లోడింగ్‌కు అనుమతిస్తారు. వీటికి నామమాత్రపు రుసుం వసూలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. నాన్‌ లీజ్డ్‌ పార్సిల్‌ వ్యాన్లలో పార్సిల్‌ బుకింగ్‌ కోసం ప్రతి ప్యాకేజీపై రూ.10, లీజ్డ్‌ వ్యాన్లలో పార్సిల్స్‌ కోసం ప్రతి ప్యాకేజీపై రూ.5 వసూలు చేస్తారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని