GPS: జీపీఎస్ మార్గదర్శకాలు వెల్లడించాలి: సీపీఎస్ అసోసియేషన్ డిమాండ్
ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత ఇచ్చే పాత పెన్షన్ విధానమే శ్రేయస్కరమని భావిస్తున్నామని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ నేతలు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన గ్యారెంటీడ్ పెన్షన్ పథకం (GPS) గతంలో ఎస్.పి. టక్కర్ కమిటీ ప్రతిపాదనకు దగ్గరగానే ఉందని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రతిపక్షనేతగా జగన్ సీపీఎస్ రద్దుకు హామీ ఇవ్వడంతోనే టక్కర్ కమిటీ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన జీపీఎస్ మార్గదర్శకాలు ఏమిటో తక్షణం వెల్లడించాలని డిమాండ్ చేసింది. గ్యారెంటీడ్ పెన్షన్ పథకం మార్గదర్శకాలు తెలియకపోవటం వల్ల ఇది ఎంతవరకూ అమోదయోగ్యమో చెప్పలేమని పేర్కొంది.
జీపీఎస్ విధానంలో పెన్షనర్లకు పీఆర్సీ వర్తించకపోవటం, కమ్యుటేషన్, అదనపు క్వాంటం పెన్షన్ లాంటి ప్రయోజనాలు లేవని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ నేతలు తెలిపారు. అందుకే ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత ఇచ్చే పాత పెన్షన్ విధానమే శ్రేయస్కరం అని భావిస్తున్నామన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పాతపెన్షన్ విధానం సాధించేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.