Vande Bharat Express: తిరుపతి ‘వందే భారత్‌’ టైమింగ్స్‌లో మార్పు.. 16 బోగీలతో రైలు ఎప్పట్నుంచంటే?

తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు కొనసాగిస్తోన్న వందే భారత్ రైలు టైమింగ్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే, ఈ నెల 17 నుంచి 16 బోగీలతో  పరుగులు పెట్టనుంది. 

Published : 15 May 2023 01:31 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌-తిరుపతి నగరాల మధ్య సేవలందిస్తోన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైలుకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తోన్న ఈ సెమీ-హైస్పీడ్‌ రైలులో బోగీల సంఖ్యను రెట్టింపు చేసిన రైల్వే బోర్డు.. తాజాగా ఆ రైలు టైమింగ్‌లో స్వల్ప మార్పులు చేసింది. అలాగే, ప్రయాణికుల అభ్యర్థన మేరకు పెంచిన 16 బోగీలతో ఈ రైలు మే 17 నుంచే పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య మంగళవారం మినహా మిగతా రోజుల్లో వందేభారత్‌ రైలు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలు వేళల్లో మార్పులపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా సమాచారం ప్రకారం..  ప్రస్తుతం ఉదయం 6గంటలకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న Vande Bharat Express రైలు ఇకనుంచి పావు గంట ఆలస్యంగా బయల్దేరనుంది. మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకే ఈ రైలు బయల్దేరేలా అధికారులు మార్పులు చేశారు. నల్గొండకు ఉదయం 7.29/7.30 గంటలకు; ఆ తర్వాత గుంటూరుకు 9.35/9.40; ఒంగోలు  11.09/11.10; నెల్లూరు మధ్యాహ్నం 12.29/12.30 గంటలకు వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలయ్యే సరికి తిరుపతికి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15గంటలకు బయల్దేరే ఈ రైలు నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. సికింద్రాబాద్‌- తిరుపతి రైలు (20701)లో 131శాతం పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదు కాగా.. తిరుపతి నుంచి తిరుగు పయనంలో మరింత ఎక్కువగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా కోచ్‌ల సంఖ్య రెట్టింపు కానుండటంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది. ఇరువైపులా ఈ రైలు 8.15గంటల్లో గమ్యస్థానాలను చేరనుంది.

త్వరలోనే పట్టాలపైకి పూరీ-హావ్‌డా వందేభారత్!

వందేభారత్‌ రైళ్లకు విశేష స్పందన వస్తుండటంతో రైల్వేశాఖ ఈ రైళ్లను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల మధ్య 15 రూట్లలో సేవలందిస్తుండగా మరో ఐదు రూట్‌లలో ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లను నడిపేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తొలుత పూరీ-హావ్‌డా మధ్య ఈ నెలలోనే కొత్త వందేభారత్‌ రైలుకు పచ్చజెండా ఊపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రూట్‌లో ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్‌-హైదరాబాద్‌; పూరీ-రాయ్‌పూర్‌ రూట్‌లలో మరికొన్ని రైళ్లు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని పూరీ- బెంగాల్‌లోని హావ్‌డా మధ్య సేవలందించే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బెంగాల్‌లో ఉదయాన్ని 5.50గంటలకు బయల్దేరి ఉదయం 11.50గంటలకు పూరీ చేరుకుంటుందని తెలుస్తోంది. అలాగే, పూరీలో 2గంటలకు బయల్దేరి రాత్రి 7.30గంటలకు హావ్‌డా చేరుకోనుంది. ఈ రైలు కుర్దా రోడ్‌ జంక్షన్‌, భువనేశ్వర్‌, కటక్‌ , జాజ్‌పూర్‌ కియోంజహర్‌ రోడ్‌, భద్రక్‌, బాలాసోర్‌, హల్దియా స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు