Secundrabad: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. కొన్ని అంతస్తుల్లో ఇప్పటికీ వెలువడుతున్న పొగ

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన సముదాయంలోకి వెళ్లేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటికీ కొన్ని అంతస్తుల నుంచి పొగలు వస్తుండడంతో ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published : 21 Jan 2023 13:11 IST

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సైతం ఇవాళ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సముదాయంలో ఇప్పటికీ కొన్ని అంతస్తుల నుంచి పొగలు వెలువడుతుండడంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. లోపల ఫోమ్‌ చల్లి పూర్తిగా ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని అధునాతన స్కానర్లతో క్లూస్‌ టీం పరిశీలిస్తోంది.

క్లూస్‌ టీంకు నేతృత్వం వహిస్తోన్న అధికారి వెంకన్న మాట్లాడుతూ.. ‘‘ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటికీ సముదాయంలో దట్టంగా పొగ వ్యాపించి ఉంది. లోపలికి వెళ్లేందుకు అన్ని మార్గాలను పరిశీలస్తున్నాం. ఒక్కసారి లోపలికి వెళ్లగలిగితే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ, ఇతర అధికారులతో పాటు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

ఘటనా స్థలిని పరిశీలించిన నేతలు..

సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనా స్థలికి తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ, సీపీఎం నాయకులు పరిశీలించారు. తాజా పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని వారు డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని