Andhra News: నా గౌరవానికి భంగం కలిగితే స్పందించకూడదా?: ఏబీ వెంకటేశ్వరరావు

పెగాసస్‌ అంశానికి సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంపై షోకాజ్‌ నోటీసు జారీ చేసిన ఏపీ ప్రభుత్వానికి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) వివరణ ఇచ్చారు.

Updated : 06 Apr 2022 11:56 IST

అమరావతి: పెగాసస్‌ అంశానికి సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంపై షోకాజ్‌ నోటీసు జారీ చేసిన ఏపీ ప్రభుత్వానికి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) వివరణ ఇచ్చారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించవచ్చని.. ఇలాంటి వాటిపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ కల్పించాయని గుర్తు చేశారు. రూల్‌-17కి అనుగుణంగానే మీడియాతో మాట్లాడినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్‌ ఛీప్‌గా ఉన్నప్పుడు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగించలేదని మాత్రమే చెప్పానన్నారు. ఆలిండియా సర్వీస్‌ రూల్‌- 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇవ్వొచ్చని ప్రత్యుత్తరంలో ఏబీవీ పేర్కొన్నారు. అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలని.. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే ఉండాలని రూల్స్‌ చెబుతున్నాయని ఏబీవీ స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో ఎక్కడా ప్రభుత్వాన్ని విమర్శించలేదన్న ఆయన.. తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-21 ప్రకారం వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు. మీడియా సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ను కూడా వివరణలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా పెగాసస్‌ వ్యవహారంపై గత నెల 21న ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారని, ఇది అఖిల భారత సర్వీసుల ప్రవర్తనా నియమావళిలోని ఆరో నియమానికి విరుద్ధమని పేర్కొంటూ గత నెల 22న ఏబీవీకి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసు తాజాగా వెలుగు చూసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని