వ్యాక్సిన్‌ సరఫరాపై ఓపికతో ఉండండి..!

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు కరోనా వ్యాక్సిన్‌కు ఇతర దేశాల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఇతర దేశాలకు ఇప్పటికే ఎగుమతి ప్రారంభించగా, మరికొన్ని దేశాలు వ్యాక్సిన్‌ కోసం వేచిచూస్తున్నాయి.

Updated : 22 Feb 2021 05:15 IST

భారత్‌తో పాటు ప్రాధాన్యత - సీరం సీఈఓ

దిల్లీ: వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు కరోనా వ్యాక్సిన్‌కు ఇతర దేశాల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఇతర దేశాలకు ఇప్పటికే ఎగుమతి ప్రారంభించగా, మరికొన్ని దేశాలు వ్యాక్సిన్‌ కోసం వేచిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. ‘వ్యాక్సిన్‌ సరఫరా కోసం మీరు ఎంతగానో వేచిచూస్తున్నారు. దయచేసి మీరు ఓపిక వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్‌ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇతర దేశాలకు పంపించడంలో సమతుల్యం వహించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాం’ అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా ఇతర దేశాలు, ప్రభుత్వాలకు ట్విటర్‌లో విన్నవించారు.

ఇప్పటికే దేశంలో కోటికి పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసిన భారత్‌, పొరుగు దేశాలకు ఉచితంగా అందించింది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌ వంటి దేశాలకు కోటి 70లక్షల డోసులను పంపించింది. ఇలా బంగ్లాదేశ్‌ నుంచి బ్రెజిల్‌ వరకు అల్ప, మధ్య ఆదాయ దేశాలు భారత్‌ తయారుచేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌పైనే ఆధారపడ్డాయి. వీటితోపాటు కెనడా కూడా తమకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని భారత్‌ను విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే దాదాపు 25దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభించిన భారత్, రాబోయే రోజుల్లో మరో 49దేశాలకు ఇక్కడ నుంచే వ్యాక్సిన్‌ సరఫరా చేసే అవకాశాలున్నాయని భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇతర దేశాలనుంచి వ్యాక్సిన్‌ డిమాండ్‌ ఏర్పడడంతో ఇక్కడి వ్యాక్సినేషన్‌పై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీరం సీఈఓ వెల్లడించారు.

భారత్‌లో అనుమతి పొందిన ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాను పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా భారీ స్థాయిలో తయారుచేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌తో పాటే అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే అందిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు కోటి పదిలక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని