L is For Lockdown: ఏడేళ్ల చిన్నారి.. ‘లాక్‌డౌన్‌’పై పుస్తకం రాసింది!

2020.. ప్రపంచానికి అదో పీడకల. కరోనా మహమ్మారి వల్ల గతేడాది జనజీవనం స్తంభించిపోయింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఇల్లు దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులకు ఇంటి నుంచే పని విధానం ప్రారంభమైంది. విద్యార్థుల చదువులు అటకెక్కాయి. విద్యా సంస్థలు మూసివేయడంతో

Published : 03 Aug 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2020.. ప్రపంచానికి అదో పీడకల. కరోనా మహమ్మారి వల్ల గతేడాది జనజీవనం స్తంభించిపోయింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఇల్లు దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులకు ఇంటి నుంచే పని విధానం ప్రారంభమైంది. విద్యార్థుల చదువులు అటకెక్కాయి. విద్యా సంస్థలు మూసివేయడంతో చిన్నారులంతా పాఠశాలకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌ చదువులు మొదలైనా.. తరగతులు రెండు, మూడు గంటలు మించవు. దీంతో మిగతా సమయంలో చిన్నారులు ఇంట్లోనే టీవీ చూస్తూ.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ కాలం గడిపేశారు. కానీ, బెంగళూరుకు చెందిన ఏడేళ్ల చిన్నారి జియా గంగాధర్‌ మాత్రం అలా సమయం వృథా చేయలేదు. తన చిన్ని చేతులతో లాక్‌డౌన్‌ అనుభావాలను ఓ పుస్తకంగా రాసింది. ‘ఎల్‌ ఈజ్‌ ఫర్‌ లాక్‌డౌన్‌’ పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకం అమెజాన్‌లో లభ్యమవుతోంది.

లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉన్న జియా.. ప్రతి రోజు చేసే పనులు, లాక్‌డౌన్‌లో ఎదురైన అనుభవాలు.. ఇబ్బందులు, నిత్యవసర వస్తువులు తెచ్చి ఇచ్చే వ్యక్తుల పలకరింపులు, ఆన్‌లైన్‌ తరగతులు ఇలా అనేక విషయాలను పుస్తకంలో కూలంకుషంగా వివరించింది. కంప్యూటర్‌, సైబర్‌ క్రైమ్‌లో బేసిక్స్‌, ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడటం నేర్చుకున్న విధానాలను కూడా పుస్తకంలో రాసుకొచ్చింది. ‘‘లాక్‌డౌన్‌ విధించగానే నాకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభయ్యాయి. దీంతో నాకు చాలా సమయం మిగిలేది. ఆ సమయంలో నేను ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా గమనించడం ప్రారంభించా. వాటినే పుస్తకంలో రాశా. పాఠశాల తెరిచి ఉండి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు ’’అని చిన్నారి జియా వెల్లడించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జియా రాసిన పుస్తకం ఆమె టీచర్‌ దివ్య చొరవతో ముద్రణకు నోచుకుంది. దివ్య ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రచురణకర్తలను సంప్రదించి పుస్తకం మార్కెట్లోకి వచ్చేలా చేసింది. ఈ పుస్తకాన్ని నాన్‌ ఫిక్షన్‌ కేటగిరిలో అమెజాన్‌ సంస్థ విక్రయిస్తోంది. జియా పుస్తకం ప్రచురితమై మార్కెట్లోకి రావడం పట్ల జియా పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది తమ విద్యార్థి మరిన్ని పుస్తకాలు రాస్తూ గొప్ప రచయిత్రి కావాలని కాంక్షిస్తూ అభినందనలు తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని