Updated : 10 May 2022 10:26 IST

Cyclone Asani: ‘అసని’ తుపాను ఎఫెక్ట్.. విశాఖకు విమాన రాకపోకలు రద్దు

విశాఖ: బంగాళాఖాతంలో 'అసని' తీవ్ర తుపాను కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో విమానాలను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఎయిర్ ఏషియాకు చెందిన దిల్లీ- విశాఖ, బెంగళూరు- విశాఖ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన ముంబయి- రాయపూర్‌- విశాఖ, దిల్లీ- విశాఖ విమానాలు రద్దయ్యాయి. తుపాను నేపథ్యంలో తీవ్ర గాలుల వల్ల ముందు జాగ్రత్త చర్యగా తమ సర్వీసులను రద్దు చేసినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి.

ఇవాళ కోస్తా.. రేపు ఉత్తరాంధ్రలో వర్షాలు..

మరోవైపు గడిచిన ఆరు గంటల్లో తుపాను గంటకు 7 కి.మీ. వేగంతో పశ్చిమవాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు 330 కి.మీ., విశాఖపట్నానికి 350 కి.మీ., గోపాలపూర్‌కు 510 కి.మీ., పూరీకి 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ రోజు రాత్రికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి.. అనంతరం దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర- ఒడిశా తీరాలకు దూరంగా ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనంతరం 12 గంటల్లో క్రమంగా తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో, రేపు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల చిరుజల్లులు కురిశాయి. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని పలాస, సోంపేట, ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి.  

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు..

ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40- 60కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. సహాయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉండాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. తుపాను నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లా యాత్రాంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts