Health: ‘ఒత్తిడి’తో సతమతమవుతున్నారా?
ఒత్తిడి.. ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. శారీరకంగానైనా.. మానసికంగానైనా మన జీవితంలో అదొక భాగమైపోయింది. బాగా ఒత్తిడికి గురైనా, కోపం వచ్చినా మన శరీరంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి...
ఇంటర్నెట్‌డెస్క్: ఒత్తిడి.. ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. శారీరకంగానైనా.. మానసికంగానైనా మన జీవితంలో అదొక భాగమైపోయింది. బాగా ఒత్తిడికి గురైనా, కోపం వచ్చినా మన శరీరంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మన శరీరం మరింత ఉత్తేజితమై, వాటి ప్రభావం కండరాలమీద పడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. తరచూ ఒత్తిడికి గురవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఒత్తిడికి గురైనప్పటికీ కొన్ని చిన్నపాటి చిట్కాలతో దీనిని దూరం చేసుకోవచ్చని అంటున్నారు.
1. వ్యాయామం తప్పని సరి
వ్యాయామం చేయడం వల్ల మెదడు నుంచి ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని కలిగించే కార్టిసోల్, అడ్రినలిన్ తదితర హార్మోన్లను వ్యాయామం ద్వారా క్రమబద్ధీకరించవచ్చు. రోజుకు కనీసం అరగంట నుంచి గంటసేపు వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి గురైన సమయంలో వ్యాయామం చేసినా ఉపయోగం ఉంటుంది. వ్యాయామం చేయలేని వారు కనీసం నడకను అలవాటు చేసుకోవాలి. ఆహ్లాదకరమైన వాతారణంలో నడిస్తే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీని వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
2. ఊపిరే ఓ ఆయుధం
బాగా ఊపిరి తీసుకోవడం, ధ్యానం, యోగా తదితర చిట్కాల ద్వారా ఒత్తిడిని చాలా వరకు అదుపు చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు గుండె వేగం పెరుగుతుంది. అందువల్ల ఊపిరిపై దృష్టిపెట్టడం ద్వారా గుండె వేగాన్ని నియంత్రించవచ్చు. అయితే ఇక్కడ 4-7-8 సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే.. 4 సెకెన్ల పాటు ఊపిరి తీసుకుంటే.. 7 సెకెన్లపాటు బిగబట్టి ఉండాలి. ఆ తర్వాత 8 సెకెన్ల పాటు నెమ్మదిగా ఊపిరి వదలాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి.
3. కంటినిండా నిద్ర
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రకు ప్రాధాన్యం తగ్గిపోయింది. పనులన్నీ ముగించుకునే సరికి ఏ అర్ధరాత్రో అపరాత్రో అవుతుంది. మళ్లీ ఉదయాన్నే లేచి పరుగోపరుగు. ఎక్కువకాలం ఇలాగే జరిగితే ఆరోగ్య సమస్యలు ఖాయమని వైద్యులు పదేపదే చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు కచ్చితంగా సరిపడా నిద్రపోవాలంటున్నారు. దాదాపు 21 శాతం మంది నిద్రలేమి కారణంగానే ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కనీసం రోజుకు 7 నుంచి 9 గంటలపాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు పడుకునేందుకు అరగంట ముందు నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండటం మంచిది.
4. ఆప్తులతో మాట్లాడండి.. హాయిగా నవ్వుకోండి
బాగా ఒత్తిడికి గురైనప్పుడు మీ ఆత్మీయులతో మాట్లాడండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం వల్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా నవ్వు చాలా రోగాలను నయం చేస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా మానసిక సమస్యలకు నవ్వే మందు. ఒత్తిడిగా అనిపించినప్పుడు నలుగురితో కలిసి నవ్వుకోవడం, కామెడీ ప్రోగ్రామ్‌లు చూడటం వల్ల ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే.. నవ్వుతున్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను తీసుకుంటాం. ఇది గుండె, ఊపిరితిత్తులు, కండరాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా శరీర అవయవాలు ఉత్తేజితమై కాస్త సాంత్వన చేకూరినట్లనిపిస్తుంది.
5. సుగంధ పరిమళాలతో ఎంతో హాయి
చిరాగ్గా ఉన్నప్పుడు ముక్కుకు ఓ సుగంధభరితమైన వాసన తగిలితే ఒక్కసారిగా మనసు తేలికపడుతుంది. బాగా ఒత్తిడి అనిపించినప్పుడు సెంట్‌ను వాసన చూస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది. మార్కెట్లో రకరకాల సెంట్లు అందుబాటులో ఉన్నాయి. మరీ ఘాటువాసన రాకుండా ఉండేవాటిని తెచ్చిపెట్టుకోండి. ఒత్తిడిగా ఉన్నసమయంలో వాటిని కాస్తా వాసన చూడండి. అంతేకాకుండా ఇష్టాలను, నచ్చిన అంశాలను, తీపి గుర్తులను ఓ పుస్తకంలో రాసిపెట్టుకోండి. ఒత్తిడి అనిపించినప్పుడు వాటిని ఒక్కసారి అలా తిరగేయండి. మనసుకు హాయిగా అనిపిస్తుంది.
6. మ్యూజిక్.. మ్యాజిక్
సంగీతం వినడం వల్ల గుండె అతివేగం తగ్గుతుంది. ఫలితంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. నచ్చిన మ్యూజిక్ మెదడు పని తీరుపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు మెదడు నుంచి తరంగాల రూపంలో ఆదేశాలు వస్తుంటాయి. ఇష్టమైన సంగీతం వల్ల వీటి వేగం తగ్గుతుంది. ఫలితంగా గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవాలు పని చేసే వేగం తగ్గుతుంది. అందువల్ల కాస్తా ఉపశమనం లభిస్తుంది.
7. ఆరోగ్యకరమైన ఆహారం
శరీరానికి వ్యాయామం, యోగా ఎంత ముఖ్యమో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఫాస్ట్ఫుడ్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంవల్ల సరిగా జీర్ణంకాక ఇబ్బందిగా అనిపిస్తుంది. విటమిన్-సి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాక కార్టిసోల్ నియంత్రణలో ఉండటం వల్ల ఒత్తిడికి గురికాకుండా ఉంటాం. కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఒమేగా ఆమ్లాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
8. సానుకూల ఆలోచనలు
పాజిటివ్ ఆలోచనలతోనూ ఒత్తిడిని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఏ చిన్న సమస్య వచ్చినా విపరీతంగా భయపడిపోతారు. చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూస్తూ.. దాని నుంచి తప్పించుకోవడం ఎలా అని అలోచిస్తారు. అలాకాకుండా సానుకూల ఆలోచనలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ సమస్య వచ్చినా.. దానిని పరిష్కరించుకునే మార్గంపై దృష్టి పెట్టాలి. అంతేగానీ తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు.
9. అభినందించండి
ఎవరైనా నచ్చిన పని చేసినప్పుడు కచ్చితంగా వారిని అభినందించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల అవతలి వారిలో ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ హార్మోన్ స్థాయి దాదాపు 23 శాతం తగ్గుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాకుండా పాజిటివ్ ఆలోచనలకు ఇక్కడే బీజం పడుతుంది. అవతలి వారు మిమ్మల్ని చూసే కోణంలో మార్పు వస్తుంది. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ హౌస్ నుంచి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్
-
Germany: మ్యూనిచ్ ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం.. మంచులో చిక్కుకుపోయిన విమానాలు..!
-
Nayanthara: స్టూడెంట్స్‌కు బిర్యానీ వడ్డించిన నయనతార.. వీడియో చూశారా!
-
భార్యాభర్తలు, మామా అల్లుళ్ల గెలుపు.. ఆ పార్టీ ఎంపీలంతా ఓటమి!
-
Social Look: క్యూట్ ట్రైనర్‌తో మహేశ్ బాబు.. మీనాక్షి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్
-
Election Results: అహంకార కూటమికి.. ఇదో హెచ్చరిక: ప్రధాని మోదీ