TS News: మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు వెంటనే పరిహారం: సింగరేణి సీఎండీ

శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్‌ఆర్‌పీ-3, 3ఏ ఇంక్లైన్‌లో ఇవాళ జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

Updated : 24 Sep 2022 16:08 IST

మంచిర్యాల: శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్‌ఆర్‌పీ-3, 3ఏ ఇంక్లైన్‌లో ఇవాళ జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన నలుగురు కార్మికుల కుటుంబాలకు సంస్థ సీఎండీ శ్రీధర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని, మృతి చెందిన కార్మికులకు కంపెనీ తరఫున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని సీఎండీ ఆదేశించారు. ఒక్కో కార్మికుడి కుటుంబానికి మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు రూ.70లక్షల నుంచి రూ.కోటి వరకు అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు.

కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి హరీశ్‌రావు

మంచిర్యాలలోని శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్‌ఆర్‌పీ-3 బొగ్గు గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలి: బండి సంజయ్‌

సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో కార్మికుల మృతి పట్ల కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో కార్మికుల భద్రత విషయంలో తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీఎంఎస్‌కు లేఖ రాయనున్నట్టు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని