Telangana News: ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోంది: హైకోర్టును ఆశ్రయించిన సిట్
మెయినాబాద్ పోలీసుల మెమోను ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
హైదరాబాద్: మెయినాబాద్ పోలీసుల మెమోను ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోందని, పోలీసులు దాఖలు చేసిన మెమోను తిరస్కరించడం సరైంది కాదని ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను సిట్ అధికారులు నిందితులుగా చేర్చారని.. దర్యాప్తులో సేకరించిన కీలక వివరాల ఆధారంగానే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని వాదించారు. కానీ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 కింద దర్యాప్తు చేసే అర్హత సిట్‌కు లేదని నిర్ణయిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు మెమోను కొట్టివేసిందని ఏజీ ప్రసాద్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైందేనని నిందితుల తరఫు న్యాయవాది రాంచందర్ వాదించారు. నిందితుల తరఫు న్యాయవాదికి నోటీసులు ఇవ్వాలని ఏజీని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.