TSPSC: పేపర్‌ లీకేజీ వ్యవహారం.. సిట్‌కు కీలక ఆధారాలు లభ్యం

టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో 2గంటల పాటు విచారణ జరిపిన సిట్ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ కీలక ఆధారాలు సేకరించారు. ఛైర్మన్‌, కార్యదర్శి పేషీల్లో సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.

Updated : 15 Mar 2023 19:20 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏఈ ప్రశ్నపత్రం లీక్‌పై అధికారులు గురువారం టీఎస్‌పీఎస్సీకి నివేదిక ఇవ్వనున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో బుధవారం 2గంటల పాటు విచారణ జరిపిన సిట్ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ కీలక ఆధారాలు సేకరించారు. కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మి, ఛైర్మన్‌, కార్యదర్శి కంప్యూటర్లను పరిశీలించారు. ఛైర్మన్‌, కార్యదర్శి పేషీల్లో సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక నిపుణుల నుంచి టీఎస్‌పీఎస్సీ సర్వర్ల వివరాలు సేకరించారు. ఐపీ అడ్రస్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నుంచి వివరాలను ప్రవీణ్‌ దొంగిలించినట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. ప్రవీణ్‌తో ఎక్కువగా ఎవరెవరు కలిసి ఉంటారనే విషయాలపై సిట్‌ ఆరా తీసినట్టు సమాచారం.

కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కంప్యూటర్‌ను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌ మరమ్మతు చేశాడు. ఆ సమయంలో డైనమిక్‌ ఐపీ అడ్రస్‌కు బదులు తనకు అనుకూలంగా స్టాటిక్‌ ఐపీ పెట్టాడు. రాజశేఖర్‌ సాయంతోనే ప్రవీణ్‌ ప్రశ్నపత్రాలను పెన్‌ డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏపీ ప్రశ్నపత్రాలు.. రేణుక, ఆమె భర్త డాక్యాకు రూ.10లక్షలకు ప్రవీణ్‌ విక్రయించినట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలను కూడా సిట్‌ అధికారులు పరిశీలించారు. రేణుక ఇచ్చిన రూ.10లక్షలు ఎస్‌బీఐ ఖాతాలో జమ చేసుకున్న ప్రవీణ్‌.. ఆ తర్వాత రూ.3.5లక్షలు రాజమహేంద్రవరంలో ఉన్న తన బాబాయ్‌ ఖాతాకు బదిలీ చేశాడు. ఇప్పటికే బేగంబజార్‌ పోలీసులు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలను సిట్‌ అధికారులు తీసుకున్నారు. ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్‌ ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ గురించి కూడా సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. రేపటికల్లా ప్రాథమిక నివేదికను ఇచ్చేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం పరిసరాల్లో ఆంక్షలు..

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. నాంపల్లిలోని టీఎస్ పీఎస్పీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు.  ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు