కొవిడ్‌ టీకాలతో చర్మానికి చిక్కులా?

కొవిడ్‌ టీకాలపై చాలామందికి అనేక రకాల సందేహాలున్నాయి. ఒళ్లునొప్పులు, జ్వరం వంటి వాటితోపాటు చర్మంమీద అలర్జీలు వస్తున్నాయని అంటున్నారు. 

Published : 23 Jun 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ టీకాలపై చాలామందికి అనేక రకాల సందేహాలున్నాయి. ఒళ్లునొప్పులు, జ్వరం వంటి వాటితోపాటు చర్మంమీద అలర్జీలు వస్తున్నాయని అంటున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత  అలర్జీలు రావడం చాలా అరుదని, వెంటనే వైద్య సాయం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ టీకాలతో చర్మానికి ఎదురయ్యే చిక్కుల గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ సందీప్‌ ఏమంటున్నారంటే..

కొవిడ్‌ టీకాలతో చర్మానికి సమస్యలు వస్తాయా?
కొవిడ్‌ వ్యాక్సిన్‌తో కొన్ని రకాల అలర్జీలు వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయంటే.. ఆ వ్యాక్సిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ కొందరిలో ఈ వ్యాధినిరోధక శక్తి ప్రతిచర్య జరపడం వల్ల అలర్జీలు వస్తాయి. ఇవి వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత గంట నుంచి ఏడు రోజుల వ్యవధిలో కనిపించవచ్చు. 

కొవిడ్‌ టీకాలతో చర్మానికి ఎలాంటి అలర్జీలు రావచ్చు?
ఈ అలర్జీలు ముఖ్యంగా అయిదు రకాలు. వ్యాక్సిన్‌ వేసిన చోట రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల వరకూ ఎర్రగా మారితే దాన్ని కొవిడ్‌ ఆర్మ్‌ అంటారు. రెండోరకంలో తట్టులాంటి దద్దుర్లు చెమటపొక్కుల్లా వస్తాయి. కొందరిలో దురద ఉంటుంది. మూడోరకంలో కాలి మునివేళ్లలోని రెండో వేలుకి రక్త ప్రసరణ తగ్గిపోయి కొవిడ్‌ టోస్‌ వస్తుంది. దాంతో ఆ వేలు నలుపు లేదా నీలం రంగులోకి మారుతుంది. నాలుగో రకంలో తీవ్రమైన నొప్పితో కూడిన బొబ్బలు వస్తాయి. దీన్ని సర్పి అంటారు. ఇది శరీరంలో ఏదో ఒక చోట వస్తుంది.  ఇక ఐదోరకం అలర్జీలో టీకా తీసుకున్న గంట తర్వాత ఒళ్లంతా దద్దుర్లతో ఎనఫిలాక్టిక్‌ రాష్ అనే అలర్జీ వస్తుంది. దీనివల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది చాలా అరుదుగా వస్తుంటుంది. ఫైజర్‌, మోడెర్నా కరోనా టీకా తీసుకున్న కొందరిలో ఇది కనిపించింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ తీసుకున్న వాళ్లలో ఇది ఇంతవరకూ ఎక్కడా నమోదు కాలేదు.

టీకా తీసుకున్న తర్వాత చర్మంపై ఎలర్జీ వస్తే ఏం చేయాలి?
ఈ అలర్జీలలో అనఫిలాక్టిక్‌ రాష్‌ వస్తే చాలా ప్రమాదం. టీకా తీసుకున్న గంటలో ఇది వస్తుంది. కాబట్టి, టీకా వేయించుకున్న ఆస్పత్రిలోనే గంటపాటు ఉండమని వైద్యులు చెబుతారు. ఒకవేళ ఈ అలర్జీ వస్తే వెంటనే దాన్ని తగ్గించేందుకు ఇంజెక్షన్లు ఇస్తారు. టీకా తీసుకున్న తర్వాత అలర్జీలు రావడం చాలా అరుదుగా సంభవిస్తుంటుంది. వెంటనే వైద్య సాయం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని