స్లో టీవీ గురించి ఎప్పుడైనా విన్నారా?

డిస్కవరీ, యానిమల్‌ ప్లానెట్‌ వంటి ఛానళ్లు మీరు చూసే ఉంటారు. అందులో జంతువులు, జలాచరాల జీవనశైలి గురించి, వాటి ప్రత్యేకతల గురించి చెబుతూ కార్యక్రమాల్ని ప్రసారం చేస్తుంటారు. అందులో జంతువులు, జలాచరాలు చేసే విన్యాసాలు, ఆట, వేట, సాహసయాత్రికుల

Published : 16 Nov 2020 01:34 IST


(ఫొటో: ఎన్‌ఆర్‌కే ఫేస్‌బుక్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిస్కవరీ, యానిమల్‌ ప్లానెట్‌ వంటి ఛానళ్లు మీరు చూసే ఉంటారు! వాటిల్లో జంతువులు, జలచరాల జీవనశైలి, వాటి ప్రత్యేకతల గురించి చెబుతూ కార్యక్రమాల్ని ప్రసారం చేస్తుంటారు. అందులో జంతువులు, జలాచరాలు చేసే విన్యాసాలు, ఆట, వేట, సాహస యాత్రికుల ప్రయాణాలను చూపిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు మహా అయితే ఓ గంట మాత్రమే ఉంటాయి. అంతకన్నా ఎక్కువసేపు చూపించినా ప్రేక్షకులకు విసుగు వచ్చేస్తుంది. అంతరిక్షం నుంచి భూమిని సైతం లైవ్‌ స్ట్రీమింగ్‌లో చూపిస్తుంటారు. వీటినీ ఎవరూ ఎక్కువ సేపు చూడరు.  విచిత్రం ఏంటో తెలుసా... నార్వేలో ఓ టీవీ ఛానల్‌ పలు ప్రయాణాలనీ, సందర్శక ప్రాంతాలనీ చిత్రీకరించి ఒకేసారి గంటల తరబడి లేదా విడతల వారీగా గంటలు గంటలు ప్రసారం చేస్తోంది. ప్రజలూ వాటిని అంతే ఓపిగ్గా చూసి ఆదరిస్తుండటం విశేషం. 

ఇలా ఒక కార్యక్రమాన్ని గంటల తరబడి ప్రసారం చేయడాన్ని ‘స్లో టెలివిజన్’ అనీ, స్లో టీవీ అనీ అంటుంటారు. ఈ విధానం 1964లో ప్రారంభమైంది. అండీ వారోల్‌ అనే అమెరికన్‌ దర్శకుడు ‘స్లీప్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఏమీ ఉండదు. జాన్‌ గియార్నొ అనే కవి ఐదు గంటల 20 నిమిషాలపాటు నిద్రిస్తుంటాడంతే. నిజానికి ఈ చిత్రాన్ని 3-4 నిమిషాల పాటే చిత్రీకరించి.. దాన్నే పునరావృతం చేస్తూ ఐదు గంటల నిడివి ఉన్న చిత్రంగా మలిచి ప్రదర్శించారు. ఈ పద్ధతిని అనుసరిస్తూ వివిధ దేశాల్లో కొన్ని టీవీ ఛానళ్లు ప్రయోగాలు చేశాయి. గంటల తరబడి వీడియో రికార్డు చేసి టీవీలో ప్రసారం చేశాయి. అయితే, ఈ స్లోటీవీకి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది మాత్రం నార్వేకి చెందిన ఓ టీవీ ఛానల్‌. అదే ‘నార్వేయన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్ ‌(ఎన్‌ఆర్‌కే)’. ఈ ఛానల్‌ 2009 నవంబర్‌ 27న ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. నార్వేలో బెర్గెన్‌ నుంచి హొనెఫొస్‌ మధ్య 371 కిలోమీటర్ల రైల్వేలైన్‌ ఉంది. దాని గుండా బెర్గెన్‌ నుంచి ఓస్లో వరకు ఒక రైలు ప్రయాణం చేస్తుండగా.. ఆ ప్రయాణం మొత్తాన్ని టీవీలో చూపించారు. రైలు కిటికీల నుంచి బయట కనిపించే సుందర దృశ్యాలు, రైలు లోపల సౌకర్యాలు చూపిస్తూ, డ్రైవర్‌తో ముఖాముఖీ నిర్వహించి ఏడు గంటల ప్రయాణాన్ని క్షణం వదలకుండా మొత్తం ప్రసారం చేశారు. దీన్ని నార్వే ప్రజలు విపరీతంగా ఆదరించారు. లక్షల్లో వీక్షణలు వచ్చాయి. అప్పటి నార్వే జనాభాలో 20శాతం మంది ఈ కార్యక్రమాన్ని చూశారట. దీంతో ఎన్‌ఆర్‌కే టీవీ నిర్వాహకులు ఇలాంటి స్లోటీవీ కార్యక్రమాలను మరిన్ని తీయడం మొదలుపెట్టారు.

ముఖ్యంగా నార్వే చారిత్రక నిర్మాణాల్ని.. సహజ అందాల్ని ప్రజలకు చూపెట్టాలన్న సంకల్పంతో స్లో టీవీ విధానంలో నాలుగైదు కెమెరాలతో వాటిని చిత్రీకరించి ఉన్నది ఉన్నట్లు గంటల తరబడి ప్రసారం చేస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌కే పదుల సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాల్ని ప్రసారం చేసింది. వాటన్నింటినీ అక్కడి ప్రజలు ఆదరించారు. ఈ ఏడాది ఇప్పటికే ఇటువంటివి రెండు కార్యక్రమాలు విడుదలయ్యాయి. ‘స్వాల్బార్డ్‌’ అనే ద్వీప సమూహం చుట్టూ పది రోజుల ఓడ ప్రయాణాన్ని విడతల వారీగా ప్రదర్శిస్తుండగా.. సెవెన్‌ మౌంటెయిన్సు ప్రాంతాల్ని నిరవధికంగా ఏడు గంటల పాటు ప్రసారం చేశారు. అలాగని మరీ పెద్ద సంఖ్యలో వీటిని చిత్రీకరించడం లేదు. చాలా సెలెక్టివ్‌గా ఈ కార్యక్రమాల్ని రూపొందించి, ప్రసారం చేస్తున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని