Venkaiah Naidu: సోమయ్య జీవితాన్ని యువత అధ్యయనం చేసి స్ఫూర్తి పొందాలి: వెంకయ్య

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వాదాలు పుట్టినప్పటికీ సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనే అంతిమంగా విజయం సాధిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు...

Published : 27 Mar 2022 01:46 IST

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వాదాలు పుట్టినప్పటికీ సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనే అంతిమంగా విజయం సాధిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాదాలు, వాదనలన్నీ మెల్ల మెల్లగా నీరుగారి.. తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయన్నారు. నాటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాల మూలాలతో పుట్టిన అనేక సిద్ధాంతాలు జాతీయవాద భావనను విస్మరించిన కారణంగా క్రమంగా తమ ప్రభను కోల్పోతున్నాయని అభిప్రాయపడ్డారు.

సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ... వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకు వెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమౌతున్నాయని తెలిపారు.  నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో జరిగిన కార్యక్రమంలో నవయుగ భారతి ప్రచురించిన  ‘స్ఫూర్తి ప్రదాత శ్రీసోమయ్య’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పితృవాత్సల్యంతో తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన సోమయ్య జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని తాను స్వయంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత సోమయ్య, దుర్గాప్రసాద్‌లకు రుణపడి ఉంటానని ఉపరాష్ట్రపతి అన్నారు. తాను జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలనని విశ్వసించి, తనను ప్రోత్సహించి ముందుకు నడిపింది వారేనని తెలిపారు. ఈ పుస్తకం వారి కార్యదీక్ష, నిబద్ధత, చిత్తశుద్ధి, నిరాడంబరత వంటి అనేక అంశాల సమాహారమని, దీని ద్వారా భావితరాలు స్ఫూర్తి పొందగలరని ఆకాంక్షించారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని