Andhra news: సంక్రాంతికి 6,400 ప్రత్యేక బస్సు సర్వీసులు

సంక్రాంతి సందర్భంగా  జనవరి 6 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మొత్తం 6400 సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు.

Updated : 19 Dec 2022 18:57 IST

అమరావతి: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. జనవరి 6 నుంచి 18 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేకబస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని, ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కూడా ఉందని చెప్పారు. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 62 స్టార్‌లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రవేశపెట్టాం. వచ్చే మార్చి నాటికి కార్గో ద్వారా రూ.165 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పని చేస్తున్నాం. అన్ని బస్సుల్లో ఈ నెలాఖరుకు టిమ్‌ మిషన్లు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆర్టీసీని ప్రైవేటీకరించే యోచన లేదు. పొరుగు సేవల ఉద్యోగులను కూడా తొలగించడం లేదు’’ అని ఆయన అన్నారు.

‘‘ఆర్టీసీ స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయించినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ స్థలాన్ని మా సంస్థకు గతంలో ఏపీఐఐసీ కేటాయించింది. సంస్థ ఆస్తులు కాపాడుకునే బాధ్యత మాపై, ప్రభుత్వంపై ఉంది. స్థలం కేటాయింపు విషయం తెలిసి నిరసన తెలిపాం. ఉద్యోగులకు ఓటీలు, అలవెన్సులు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించాం. వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాం. అలవెన్సులపై ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ కంగారు పడొద్దు. ఆర్టీసీ ఆదాయాన్ని ప్రతిరోజూ ప్రభుత్వానికి చెల్లించే ప్రతిపాదన లేదు.’’ అని ద్వారకా తిరుమలరావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని