CM Jagan Tour: సీఎం తిరువూరు పర్యటన.. జగన్‌ ఫొటోతో పోలీసులకూ ప్రత్యేక గుర్తింపుకార్డులు

జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం కాసేపట్లో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జరగనుంది.

Updated : 19 Mar 2023 14:05 IST

తిరువూరు: జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం కాసేపట్లో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై నిధులను విడుదల చేయనున్నారు. అయితే సీఎం బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులకూ ఈసారి ప్రత్యేక గుర్తింపుకార్డులు జారీ చేశారు. జగన్‌ ఫొటోతో ఆ కార్డులు ఇచ్చారు. బందోబస్తు విధులకు వచ్చే పోలీసులు తప్పకుండా ఆ గుర్తింపుకార్డు ధరించాలని అధికారులు ఆదేశించారు. మీడియా చిత్రీకరిస్తుండటంతో కార్డును వెనక్కితిప్పి ఉంచుకోవాలని సిబ్బందికి సూచిస్తున్నారు. సీఎం ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డులు మెడలో ధరించాలనడంపై పలువురు పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులకు అవస్థలు తప్పవు..

తిరువూరు పర్యటనకు సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి చేరుకోనున్నారు. పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి వస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం నుంచి ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. జగదల్‌పుర్‌ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎనిమిది గంటలు వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. నిత్యం జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలకు ఆదివారం అవస్థలు తప్పవు.

మైలవరం వైపు నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను చీమలపాడు సెంటర్‌ మీదుగా గంపలగూడెం, కల్లూరు వైపు, మైలవరం నుంచి భద్రాచలం వెళ్లే వాహనాలను ఎ.కొండూరు అడ్డరోడ్డు నుంచి విస్సన్నపేట మీదుగా సత్తుపల్లి వైపు, భద్రాచలం నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను కల్లూరు, చీమలపాడు వైపు మళ్లిస్తున్నారు. దీనివల్ల అరగంటలో తిరువూరు దాటి వెళ్లే వాహనదారులు చుట్టూ తిరిగి రెండు గంటలు ప్రయాణించాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని